News

మావోలకు దీటుగా బదులిస్తాం – హోం మంత్రి అమిత్ షా

1.4kviews

మావోయిస్టుల రక్తపాతాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలో పర్యటిస్తోన్న అమిత్‌ షా, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన నేపథ్యంలో హుటాహుటీన ఢిల్లీకి ప్రయాణమయ్యారు.

బీజాపూర్‌, సుకుమా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాన్లతో పాటు మావోయిస్టుల వైపు కూడా ప్రాణనష్టం సంభవించిందని కేంద్ర హోంశాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై పూర్తి వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. ఆచూకీ లభించని జవాన్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అమిత్‌ షా వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమరులైన జవాన్ల త్యాగాలు ఎన్నటికీ వృథా పోవని స్పష్టం చేశారు. అస్సాంలోని ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి హిమంతా బిస్వకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ప్రచార సమావేశంలో మాట్లాడకుండానే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళిన హోంమంత్రి, ఛత్తీస్‌గఢ్‌ పరిణామాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.