364
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పురపాలక కార్యాలయం వద్ద బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (బీడీసీ) సభ్యుడు రియాజ్ అహ్మద్, ఆయన గన్‌మెన్ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మరో కౌన్సిలర్ కూడా గాయపడటంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి. మరోవైపు, గత ఐదు రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన అని పోలీసులు తెలిపారు. గురువారం రోజు కూడా శ్రీనగర్ శివారులోని లావాయ్‌పొరాలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.