
ముంబైలోని భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్ లో గల సన్‌రైజ్ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. మాల్‌లోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. మూడో అంతస్తులో ఉన్న ఆస్పత్రి వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. అయితే తొలుత అగ్నిప్రమాదంలో రోగులెవరూ మరణించలేదని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆ తర్వాత కొంతమంది రోగుల ఆచూకీ గల్లంతైనట్లు పేర్కొనడం గమనార్హం.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలాన్ని సందర్శించిన సీఎం.. మృతుల కుటుంబాలకు క్షమాపణలు తెలియజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతేడాది రాష్ట్రంలో వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించిన సమయంలో బెడ్లు, వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. దీంతో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రమాదం చోటుచేసుకున్న సన్‌రైజ్ ఆస్పత్రి కూడా అందులో ఒకటి.





