News

దేవాలయ వ్యవస్థని కాపాడుకుందాం – స్వర్గీయ టి.ఎస్.రావు శ్రద్ధాంజలి సభలో డా.అనంత లక్ష్మి పిలుపు

597views

“హిందూ సమాజంలో దేవాలయానికి ఎంతో ప్రాచీన,ప్రముఖ చరిత్ర ఉంది.ద్వాపర యుగము చివరి నాటికే దేవాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది.ఆ నాటి గ్రామాలకు,నగరాలకు చివరికి సమాజానికి కేంద్ర బిందువు దేవాలయమే..మానవ దేహము దేవాలయము ఒకే రూపంలో ఉంటాయి. శరీరంలోని హృదయం వంటిదే దేవాలయంలోని గర్భ గృహం.” అని స్వర్గీయ టి.ఎస్.రావు శ్రద్ధాంజలి సభలో ప్రధాన వక్త డాక్టర్ అనంత లక్ష్మి తెలిపారు.

దేవాలయంలోని మూర్తి సజీవమైనది. దానికి మంత్ర, యంత్రాలతో ప్రాణ ప్రతిష్ట చేస్తారు. దేవాలయం శ్రద్దా కేంద్రము మాత్రమే కాదు, విద్యా కేంద్రం, వైద్య కేంద్రం, కళల ప్రదర్శనా కేంద్రం, ధర్మ ప్రచార కేంద్రం కూడా. మన పూర్వీకులు దేవాలయాల సక్రమ నిర్వహణకు అనేక సౌకర్యాలు కల్పించినా అనేక కారణాల వల్ల నేడు అనేక దేవాలయాలు శిధిలమయ్యాయి. ధూప, దీప నైవేధ్యాలు లేకుండా పోయాయి. నేడు నూతన గుడుల నిర్మాణం కోసం కాక శిధిలమైన దేవాలయాల పునరుద్దరణకు, ఆ దేవాలయాల్లో దీపం వెలిగించి, ప్రసాదం నైవేధ్యంగా సమర్పించే పనికి ముందుకు రావాలని” ఆమె పిలుపునిచ్చారు.

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఉద్యమానికి నేతృత్వం వహించిన స్వర్గీయ టి.ఎస్.రావు గారి సేవల గురించి, ఉద్యమ వివరాలను శ్యామ్ ప్రసాద్, డా. భగవంత రావు, సౌమిత్రి లక్ష్మణాచార్యలు వివరించారు. సభ స్వర్గీయ టి.ఎస్.రావు గారికి శ్రద్ధాంజలి ఘటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.