News

భారత్ కు నీరవ్ మోడీ అప్పగింత

623views

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (‌PNB) కి రూ.14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. భారత్ ‌కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్‌ చేసిన ప్రయత్నాలన్నింటికీ బ్రిటన్ కోర్టు అడ్డుపుల్ల వేసింది. మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువైన నేపథ్యంలో నీరవ్ ను భారత్ ‌కు అప్పగించాలని వెస్ట్ ‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి శామ్యూల్‌ గూజీ తీర్పు వెలువరించారు.

భారత్ ‌లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి కూడా సరిగా లేదంటూ నీరవ్‌ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. భారత్ ‌కు అప్పగించినంత మాత్రన అన్యాయమేమీ జరగదని పేర్కొంది. మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కొట్టిపారేసింది. మనీలాండరింగ్‌ విషయంలో భారత్‌ సమర్పించిన ఆధారాలు సరిపోతాయని అభిప్రాయయపడిన కోర్టు.. అతడిని భారత్ ‌కు అప్పగించాలని తీర్పు వెలువరించింది. తమ ఉత్తర్వులపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. నీరవ్‌ చట్టబద్ధంగా వ్యాపారం చేశారనడాన్ని తాను నమ్మడం లేదని, లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తాను విశ్వసిస్తున్నట్లు వెస్ట్ ‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.