News

కొనసాగుతున్న భారత్, చైనా బలగాల ఉపసంహరణ

500views

తూర్పు లాడ్డాఖ్ లోని పాంగాంగ్‌ సరస్సు వెంట భారత్‌, చైనా సైనిక బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలోని ఘర్షణాత్మక ప్రాంతాలనుంచి యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. దక్షిణ తీరం నుంచి సైనికుల ఉపసంహరణ పూర్తయినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో ఇరు దేశాలూ చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలను మరికొన్ని రోజుల్లో కూల్చేస్తారని పేర్కొన్నాయి. అయితే బలగాల ఉపసంహరణ కేవలం ఇరు సైన్యాలు తలపడిన ప్రాంతాలనుంచే ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. దాదాపు 9 రౌండ్ల చర్చల తరువాత బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ప్రక్రియపై ఇరు దేశాల సైనిక కమాండర్లు నిరంతరం చర్చలు జరుపుతూ సమన్వయం చేసుకుంటున్నారు. బలగాల ఉపసంహరణ పూర్తయిన అనంతరం ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి.

మరోవైపు గల్వాన్‌ లోయ వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు మే లేదా జూన్ ‌లో పార్లమెంటరీ బృందం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి జోయల్‌ ఓరమ్‌ అధ్యక్షుడిగా ఉన్న ఈ 30 మంది బృందంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా సభ్యుడిగా ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.