
కేరళలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. పల్లకాడ్‌కు చెందిన ఒక సీనియర్ న్యాయమూర్తి ‘ట్రిపుల్ తలాక్’ జారీ చేసి తన భార్య నుంచి అక్రమంగా విడాకులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అందిన సమాచారం ప్రకారం, కేరళ పాలక్కాడ్ జిల్లాలో సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న బి కలాం పాషా భార్య తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించింది.
తన ఫిర్యాదులో, న్యాయమూర్తి కలాం పాషా 2018 మార్చి 1 న ఒక లేఖ ద్వారా తనకు ట్రిపుల్ తలాక్ జారీ చేసినట్లు ఆమె తెలిపారు. జస్టిస్ బి కలాం పాషా మరియు అతని సోదరుడు తాను గనుక విడాకులకు నిరాకరిస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ తనను బెదిరించారని కూడా ఆమె ఆరోపించారు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నిందితుడు న్యాయమూర్తి కలాం పాషా సోదరుడు బి కేమల్ పాషా, కేరళ హైకోర్టు రిటైర్డ్ జడ్జి.
అనంతరం తన భార్య పంపిన ఫిర్యాదు లేఖలో టైపింగ్ లోపం ఉందని పేర్కొంటూ న్యాయమూర్తి కలాంపాషా ఆమెకు మరో లేఖ పంపాడు. ట్రిపుల్ తలాక్ జారీ చేసిన అసలు తేదీని ఫిర్యాదులో తప్పుగా పేర్కొన్నారని, తాను తన భార్యకు మార్చి 1, 2017 న ట్రిపుల్ తలాక్ చెప్పానని జడ్జి ఆ లేఖలో పేర్కొన్నారు.
సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ తప్పించుకునే యత్నం :
ట్రిపుల్ తలాక్ నిషేద చట్టం అమల్లోకి రాకముందే తాను తన భార్యకు తలాక్ చెప్పినట్లుగా కలాం పాషా చెప్పుకుంటున్నారు. కానీ న్యాయమూర్తిపై చట్టపరమైన చర్యలను నివారించడానికే తేదీని మార్చి చెబుతున్నారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
అలాగే, మన దేశంలో ఒక న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడం అంత తేలికైన విషయం కాదు. దిగువ కోర్టు న్యాయమూర్తిపై కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో మాత్రమే బుక్ చేయాల్సి ఉంటుంది.
‘ట్రిపుల్ తలాక్’ అనే అనాగరిక పద్ధతిని పార్లమెంటు చట్టవిరుద్ధం చేసింది. తలాక్ చెప్పే భర్తపై నేరారోపణలకు ఆస్కారమిచ్చింది. ఏదేమైనా, ఈ కేసులో, ఇలాంటి కేసులలో న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న న్యాయమూర్తే మధ్యయుగాల నాటి పద్ధతిని అనుసరిస్తూ ఉండడం అత్యంత ఆశ్చర్యకరం, ఆందోళనకరం కూడా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ట్రిపుల్ తలాక్ పద్ధతిని సుప్రీంకోర్టు 2017 ఆగస్టులో నిషేధించింది. దీని తరువాత పార్లమెంటు ముస్లిం మహిళలను కించపరిచే పద్ధతిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. దీంతో ముస్లిం పురుషులకు అంతకు ముందు తమ వివాహ బంధాన్ని ముగించడానికి వున్న ఏకపక్ష అధికారాన్ని తొలగించినట్లైంది.
Source : OPINDIA





