ArticlesNews

చరిత్ర మరచిన మహనీయుడు కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని (నాయన)

387views

యన చిన్న వయసులోనే విశేష ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన ఆధ్యాత్మిక మాహా యోగి.. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని నినదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. స్త్రీలు కూడా యజ్ఞ మంత్రోపదేశాలకు అర్హులని గర్జించిన సిద్ధపురుషుడు.. కుల వివక్ష, దురాచారాలపై యుద్ధం ప్రకటించిన మన ఆంధ్రుడు “శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని”. కానీ  ఆయన చరిత్రలో కనుమరుగైనాడు. చరిత్ర పుస్తకాలలో కానరాడు.

అది 1857 వ సంవత్సరం. భారత స్వాతంత్ర్యోద్యమం ఊపిరిపోసుకుంటున్న రోజులవి. స్వాతంత్రోద్యమ వీరులను, సానుభూతిపరులను ఆంగ్లేయులు అతి క్రూరంగా అణిచివేస్తున్నారు. ఆ కిరాతకాన్నంతా కళ్ళారా చూసి చలించిపోయిన విజయనగరం జిల్లా బొబ్బిలికి సమీపాన గల కలువరాయి గ్రామానికి చెందిన అయ్యల సోమయాజుల నరసింహశాస్త్రి అనే పండితుడు “ఈ ఆంగ్లేయుల బానిసత్వం నుండి భారత మాతను విముక్తి చేయగల కుమారుడు తనకు కలగాలి” అని భగవంతుడిని ప్రార్ధించాడు. ఆ ప్రార్ధన ఫలితమే 1878 నవంబర్ 17 న ఒక పుత్రుడు జన్మించాడు. అతడే అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి

అతడు ఏకసంథాగ్రహి. 19 ఏళ్లకే వ్యాకరణాలంకార సాహిత్య శాస్త్రాల్లో, పురాణేతిహాసాల్లో పండితుడై 1896 నుండి 1902 వరకు దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అరుణాచలం చేరి భగవాన్ రమణ మహర్షి ప్రియ శిష్యుడైన అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి  కాలక్రమేణ కావ్యకంఠ వాసిష్ట గణపతి మునిగా ప్రసిద్ధి పొందారు.

1903వ సం.రం, చెన్నపట్టణం చేరి కొందరు విద్యార్థులను, యువకులను సమీకరించి కర్మయోగం, వేదకాలపు ఋషి జీవన విధానం, స్త్రీ పురష వివక్ష మరియు వర్ణ వివక్షలను అంతమొందించటం, ప్రతి ఇల్లు మంత్ర స్పందితంకావడం అనే 4 ఆశయాల ద్వార లోకకళ్యాణం జరుగుతుంది అని భావించారు.

1904వ సంవత్సరంలో వేలూరు క్రైస్తవ పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేస్తూ కుల వివక్షకు తావులేకుండా యువకులందరినీ సమీకరించి “ఇంద్రసంఘం” అనే సంస్ధను స్ధాపించి భారత దేశ స్వాతంత్రాన్నికోరుతూ “ఉమాం వందేమాతరం” అనే మంత్రాన్ని యువకులకు ఉపదేశించారు గణపతి శాస్త్రి.

మంత్ర దీక్ష ఇవ్వడంతో హిందువులలో దేశంపట్ల స్వాభిమానం పెరిగి మతమార్పిడికి అడ్డుకట్ట వేయగలిగారు.

భారత దేశ వైభవాన్ని కోరుతూ 1922 లో “ఇంద్రాణీ సప్తశతి” అనే పుస్తకం వ్రాసి మహిళలు సైతం యజ్ఞోపవీతం, మంత్రోపదేశానికి అర్హులని బహిరంగంగా చాటి చెప్పిన ధైర్యశాలి మన కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని.

1923 లో కాకినాడ, ఆలమూరు కాంగ్రెస్ మహా సభల్లో, 1924లో ద్రావిడ రాష్ట్రీయ కాంగ్రెస్ సభకు అధ్యక్షునిగా ఉండి అస్పృశ్యత మరియు దురాచారాలను ఎండగట్టాలని, సంస్కృత భాషను జాతీయ భాషగా ప్రవేశపెట్టాలని బహిరంగంగా మాట్లాడిన ధైర్యశాలి, మన ఆంధ్రుడు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని.

తమిళనాడులో శర్మదేవీ క్షేత్రంలో దళిత వ్యక్తిని వంటవానిగా పెట్టించడంతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదపడిన వీరిని సాక్షాత్తు గణపతి సాధకులుగా అందరూ భావిస్తారు.

దళితుల ఉన్నతి కోసం చేసిన కృషికి గౌరవ సూచకంగా 1927 ఫిబ్రవరి 25న, హైదరాబాద్ లోని శ్రీ మందపాటి హనుమంతరావు గారి ఇంటి నుండి చాదర్ ఘాట్ వరకు దళితులచే ఊరేగింపబడి వారిచే జరిగిన సభలో “ముని” అనే బిరుదు పొందిన మన ధార్మిక – విద్యారంగ దార్శనికుడు అయిన శ్రీ గణపతి ముని 1936 జూన్ 25న సమాధి పొందారు.

అలా ఒక స్వాతంత్ర్య పోరాట సాధకుడు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామజిక అస్పృశ్యతను బహిరంగంగా ఎదిరించిన ధైర్యశాలి, ఎందరికో స్ఫూర్తిదాయకమై భారతదేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరచుకున్న శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని జీవితం నేటి యువతకు ఆదర్శం…

నేడు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని 142వ జయంతి.

– అనంత విజయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.