
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవానులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది లొంగిపోయాడు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్‌పొరా గ్రామంలో ముష్కరుల అలికిడి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహించి ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేశాయి. ఈ ఘటనలో మరో ఉగ్రవాది లొంగిపోయినట్లు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. వారి వద్దనుంచి తుపాకులు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ‘పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో స్థానిక ఉగ్రవాది ఒకడు లొంగిపోయాడు. ఆపరేషన్ కొనసాగుతోంది’ అని కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు.
పాంపొరే ప్రాంతంలో గురువారం సైతం ఓ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కూంబింగ్ కు వెళ్లిన సెక్యూరిటీ బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గాయపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది ఓ ఉగ్రవాదిని హతమార్చారు.





