
భారత్‌లో ఉగ్ర దాడులకు పాకిస్థాన్ భారీ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్ర దాడులే లక్ష్యంగా పాక్ ఇంటెలిజెన్స్, ఉగ్రమూకలు కలిసి పథకం పన్నినట్టు పసిగట్టాయి. కరెన్ సెక్టార్‌కు ఎదురుగా అత్తుకం, దుధ్నియల్, తహండపాని ప్రాంతాల్లో భారీగా ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన 10మంది ఉగ్రవాదులు నీలం లోయ వద్ద ఉన్నారని, భారత్‌లోకి చొరబడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపాయి. అలాగే, సుజియాన్ ప్రాంతంలోని పాకిస్థాన్ గ్రామాల్లో 40 మంది ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పీవోకేలో ఐఎస్‌ఐ, ఉగ్రనేతలు రెండుసార్లు సమావేశమైనట్టు సమాచారం. శీతాకాలానికి ముందే ఉగ్రదాడులకు వ్యూహ రచన చేశారనీ.. ఈ నెల 4, 7 తేదీల్లో పీవోకేలో రెండుసార్లు సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. నిఘా వర్గాల నివేదిక ప్రకారం ఒక్క దాడికి రూ.26లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద ఆపరేషన్ కోసం రూ.30లక్షలు విడిగా ఇచ్చినట్టు సమాచారం.
భారత్‌లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చొరబడేలా పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోందని.. ఎల్‌వోసీ వద్ద లాంచ్ ప్యాడ్‌ల ద్వారా ఉగ్రవాదులు చొరబడేలా పన్నాగం పన్నినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అయితే భారత భద్రతా దళం బలంగా ఉండటంతో వారి దుష్ట పన్నాగాలు బెడిసికొడుతున్నాయని ఓ సీనియర్ సైనికాధికారి తెలిపారు. సోపోర్‌లో సైన్యం నిర్వహించిన మెగా స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నీలం లోయ సమీపంలోని తంగ్ధర్ సెక్టార్‌లో చొరబాటుకు ముష్కరులు ప్రణాళికలు వేసినట్టు సమాచారం. అలాగే, సుజియాన్ ప్రాంతంలో పాక్ గ్రామాల్లో ఉగ్రమూకల కదలికలు ఉన్నట్టు నిఘావర్గాలు గుర్తించారు. పాకిస్థాన్ ఆర్మీ సమక్షంలోనే ఈ చొరబాటుకు ప్రణాళికలు చేసినట్టు సమాచారం.





