
జమ్మూకశ్మీర్‌ను చైనాలో భాగంగా చూపించి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ వివాదంలో చిక్కుకుంది. లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతంలో ఉన్న యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఓ పాత్రికేయుడు ట్విటర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జాతీయ భద్రత వ్యవహారాల విశ్లేషకులైన నితిన్ గోఖలే అమరవీరుల చిహ్నమైన హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి ట్విటర్ వేదికగా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో ట్విటర్ వీడియోలో లొకేషన్ ట్యాగ్ ‘జమ్మూకశ్మీర్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’గా దర్శనమిచ్చింది. గోఖలేతో పాటు ఇతర ట్విటర్ యూజర్లు వెంటనే ఆ తప్పును గుర్తించారు. ట్విటర్, ట్విటర్ ఇండియా అధికార ఖాతాల్లో దాన్ని ఎత్తిచూపారు. ‘నేను హాల్ ఫేమ్ నుంచి ట్విటర్ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నాను. హాల్ ఆఫ్ ఫేమ్ లొకేషన్ కాగా, జమ్మూకశ్మీర్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఆ వీడియోలో చూపిస్తోంది!’ అని తరవాత గోఖలే ట్వీట్ చేశారు. హాల్ ఆఫ్ ఫేమ్(లేహ్) అని లొకేషన్ ట్యాగ్ చేసి ట్విటర్‌లో లైవ్ చేయమని ఇతర యూజర్లను ఆయన కోరారు. అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన కంచన్ గుప్తా ఈ వివాదంపై ట్వీట్ చేశారు. ‘ఈ భౌగోళిక ప్రాంతాన్ని మార్చి, జమ్మూ కశ్మీర్‌ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ప్రకటించాలని ట్విటర్ నిర్ణయించుకుందన్నమాట. ఇది భారత చట్టాల ఉల్లంఘన కాకపోతే ఇంకేంటి?’ అని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, చైనాకు చెందిన షావోమి ఫోన్లు అరుణాచల్ప్రదేశ్‌లోని ప్రదేశాలకు సంబంధించిన వాతావరణ నివేదికల్ని చూపించడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన మరుసటి రోజే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రెండూ కూడా భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొని ఉన్న తరుణంలో చోటుచేసుకోవడం గమనార్హం.





