
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో మానవ హక్కుల కార్యకర్తను అదుపులోకి తీసుకుంది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి(83)ని ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని ముంబయికి తరలించనున్నారు. అంతకుముందు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. గతంలోనే ఆయన్ని రెండు సార్లు పుణె పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు విచారించారు. ఆయనకు నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు ఆరోపించారు. భీమా కోరేగావ్ కేసులో అరెస్టైన రోనా విల్సన్, అరుణ్ ఫెరారియ, వరవరరావు, సుధా భరద్వాజ్ సహా మరికొంత మందితో స్టాన్ స్వామికి సంబంధాలు ఉన్నట్లు తేలిందని తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం స్టాన్ స్వామి గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే, ఎలాంటి వారెంట్ లేకుండా ఆయన్ని అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డిసెంబర్ 31, 2017లో పుణెలో ఓ కార్యక్రమం జరిగిన తర్వాత రోజు మహారాష్ట్రలో భారీ స్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఆ హింసలో ఓ వ్యక్తి మృతిచెందారు. ఎల్గార్ పరిషత్ సమావేశ నిర్వాహకులు విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వల్లే హింస చెలరేగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ప్రసంగాలు చేసిన వారితో పాటు, ఆ సమావేశానికి కారకులైన వారందరినీ అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.





