
ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్‌ను తగులబెట్టిన కేసులో పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బరీందర్ ధిల్లాన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధానిలోని రాజ్‌పథ్, మాన్‌సింగ్ రోడ్‌లో ట్రాక్టర్‌ను తగులబెట్టినందుకుగానూ మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. వారిపై ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం, విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేసిన ఆందోళనల్లో పాల్గొన్న వారిలో 15 నుంచి 20 మందికి పంజాబ్ యూత్ కాంగ్రెస్‌తో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వీరంతా ‘లాంగ్ లివ్ షాషీద్ భగత్ సింగ్’, ‘రైతు వ్యతిరేకి నరేంద్రమోదీ’ అంటూ నినాదాలు చేశారన్నారు. దహనం చేసిన ట్రాక్టర్‌ను ఇండియాగేట్ వద్దకు ట్రక్కులో తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందని దిల్లీ పోలీసులు చెప్పారు.





