
శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నానని తెలిపారు. తితిదే యాక్ట్ రూల్ 136 ప్రకారం హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్ విషయంలో తితిదే కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. గతంలో వైఎస్‌ఆర్, సోనియా శ్రీవారి దర్శనానికి వచ్చినా డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని తెలిపారు. తిరుమల శ్రీవారిపై సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
ఒక్కరికోసం తిరుమల సంప్రదాయాలు మారుస్తారా? : రఘురామ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో లేవనెత్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. రాష్ట్రంలో ఆలయాల కోసం ఓ ప్రత్యేక కమిషన్ వేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఎంతో విశిష్ఠ చరిత్ర ఉన్న తిరుమల ఆలయ నియమ నిబంధనలను ఒక్క వ్యక్తి కోసం మారుస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ మిగతా వైకాపా ఎంపీలు నినాదాలు చేశారు.
అన్యమతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు డిక్లరేషన్ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అంతకముందు దిల్లీలో రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్ కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. ఆలయనిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.