
చైనా ఇంటిలిజెన్స్ విభాగానికి రహస్య సమాచారాన్ని చేరవేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది వరకే ఈ కేసులో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేయగా తాజాగా చైనాకు చెందిన ఓ మహిళ, మరో నేపాలీ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరిద్దరూ సమాచారాన్ని చేరవేసిన సదరు జర్నలిస్టుకు పెద్ద మొత్తంలో డబ్బును ముట్టజెప్పారని పోలీసులు తెలిపారు.
చైనా నిఘా వర్గాలకు మన దేశ రక్షణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని చేరవేసిన కేసులో రాజీవ్ శర్మను స్పెషల్ సెల్ పోలీసులు ఈ నెల 14న అరెస్ట్ చేశారు. సమాచారానికి సంబంధించి సంబంధిత డాక్యుమెంట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఏడాదిన్నరగా రూ.40 లక్షలు రాజీవ్ శర్మకు ముట్టినట్లు పోలీసులు చెప్పారు.. తాజాగా అరెస్టయిన ఇద్దరూ.. ఆ జర్నలిస్టుకు డొల్ల కంపెనీల ద్వారా డబ్బును అందజేశారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, ఇరత సున్నితమైన సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.





