News

రిటైర్డ్ నేవీ అధికారిపై శివసేన కార్యకర్తల దాడి

932views

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను ఎగతాళి చేసినట్లుగా గీసిన కార్టూన్‌ను షేర్‌ చేసినందుకు శివసేన కార్యకర్తలు నేవీ మాజీ అధికారి మదన్‌ శర్మపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ చితకబాదారు. ఆయన గాయాలతో బాధపడుతున్న వీడియో, ఫోటోలను ప్రతిపక్ష భాజపా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొరబడి బయటకు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

మదన్‌ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల మేరకు స్థానిక సొసైటీ వాట్సాప్‌ గ్రూప్‌లో మదన్‌ శర్మ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు సంబంధించిన ఓ కార్టూన్‌ను షేర్‌ చేశారు. అదే రోజు సాయంత్రం ఆయనకు కమలేశ్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి పేరు, అడ్రస్‌ అడిగాడు. మధ్యాహ్నం ఇంటి దగ్గరకు వచ్చి బయటకు పిలిచాడు. బయటకు వెళ్లిన మదన్‌శర్మకు మాస్కులు కట్టుకున్న కొందరు వ్యక్తులు గుంపుగా కనిపించడంతో భయపడి ఇంట్లోకి పరుగెత్తాడు. వెంబడించిన ఆ వ్యక్తులు మదన్‌ శర్మను పిడిగుద్దులు గుద్దుతూ బయటకు ఈడ్చుకొచ్చారు.

ఈ క్రమంలో మదన్‌ శర్మ కంటిపై తీవ్రగాయమైంది. ఈ ఘటనను భాజపా తీవ్రంగా ఖండించింది. పలువురు పార్టీ నేతలతోపాటు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఈ చర్యను తప్పుబట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.