News

జీఐఐ టాప్‌ 50 లో భారత్‌

472views

ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 50 వినూత్న దేశాల జాబితాలో భారత్ తొలిసారిగా స్థానం దక్కించుకుంది. 2020 ఏడాదికిగాను గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ (జీఐఐ) విడుదల చేసిన జాబితాలో భారత్ 48 స్థానాన్ని సొంతం చేసుకుని దక్షిణ ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (విపో), కార్నెట్ విశ్వవిద్యాలయం, ఇన్‌సీడ్ బిజినెస్‌ స్కూల్ సంయుక్తంగా ఈ జాబితాను బుధవారం విదుదల చేశాయి. దీని ప్రకారం భారత్‌, చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలు ఆవిష్కరణ ర్యాంకింగ్స్‌లో గణనీయమైన అభివృద్ధిని నమోదుచేశాయి. అధిక ఆదాయం కలిగిన దేశాలైన స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్‌లు టాప్‌ 10లో ఉన్నాయి.

జీఐఐ ప్రకారం మధ్య ఆర్థిక ఆదాయం కలిగిన వినూత్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకు ముంబయి, దిల్లీ నగరాల్లోని ఐఐటీలు, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)ల శాస్త్రీయ పరిశోధనలే కారణమని జీఐఐ పేర్కొంది. ఇన్ఫరేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సేవల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్‌లైన్‌ సేవలు, సైన్స్‌, ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్ ఆధారిత అంతర్జాతీయ సంస్థలు వంటి వాటి ఆధారంగా కేటాయించే ర్యాంకుల్లో భారత్ టాప్‌ 15 జాబితాలో చోటుదక్కించుకుందని జీఐఐ వెల్లడించింది.

మొత్తం 131 దేశాలలోని సంస్థల ఉత్పాదకత, మానవ మూలధనం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, మార్కెట్లు, వ్యాపార అధునాతనత, టెక్నాలజీ, సృజనాత్మక ఉత్పాదకతల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయిస్తారు. అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో భారత్‌ స్థానాన్ని మెరుగుపరచేందుకు నీతి ఆయోగ్‌ వివిధ రంగాలలో విధానపరమైన ఆవిష్కరణలను తీసుకొస్తూ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు జీఐఐ పేర్కొంది. 2015లో భారత్‌ 81 ర్యాంకులో ఉండగా, 2019లో 52వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం మరింత మెరుగుపరుచుకుని టాప్‌ 50లో చోటుదక్కించుకుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.