News

ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు హతం

466views

ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. గుండాల మండలం దేవెళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ ప్రాంతాన్ని ఎస్పీ సునీల్‌ దత్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చాలా కాలంగా మావోయిస్టు దళాలు, యాక్షన్‌ టీమ్‌ల సంచారం ఉందన్న సమాచారంతో నిఘా పెంచామన్నారు. బుధవారం రాత్రి నుంచి వాహన తనిఖీలు చేపట్టామన్నారు. గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తనిఖీ చేయడానికి ఆపేందుకు యత్నించగా పోలీసులపై కాల్పులు జరిపారన్నారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగినట్లు ఎస్పీ వెల్లడించారు. గత జూలైలోనూ భద్రాద్రి కొత్తగూడెంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

మరోవైపు మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా కుమురంభీం ఆసిఫాబాద్‌కు చేరుకుని పాలనాధికారి సందీప్‌కుమార్‌ ఝా, ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణువారియర్‌తో కలిసి ప్రాణహిత నది పరీవాహక ప్రాంతం, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో విహంగ వీక్షణం చేశారు. అనంతరం జిల్లా పోలీసులతో సమావేశమై మావోయిస్టుల కట్టడికి దిశానిర్దేశం చేశారు. గత జులై 17న డీజీపీ ఆసిఫాబాద్‌కు వచ్చి ఒకరోజు ఉన్నారు. 45 రోజుల వ్యవధిలోనే రెండోసారి జిల్లాకు వచ్చి మళ్లీ ఇక్కడే బస చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.