News

వాయుదళానికి బలం చేకూర్చనున్న రఫెల్ యుద్ధ విమానాలు

476views

భారత వాయుదళానికి మరింత బలం చేకూరుస్తూ రఫేల్‌ యుద్ధ విమానాలు సెప్టెంబర్‌ 10న వాయుసేనలో అధికారికంగా చేరనున్నాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రఫేల్‌ విమానాలను భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేర్చనున్నారు. అంబాలాలోని వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీని కూడా ఆహ్వానిస్తున్నారు. సెప్టెంబర్‌ 4 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో ‘షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌’ సభ్య దేశాలు నిర్వహించే రక్షణ శాఖ మంత్రుల సమావేశం అనంతరం రాజ్‌నాథ్‌సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని రక్షణశాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. ‘సెప్టెంబర్‌ 10న ఐదు రఫేల్‌ యుద్ధ విమాలను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సిగ్‌ అంబాలా వైమానిక స్థావరంలో ఆహ్వానించనున్నారు’ అని ఓ అధికారి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రికి ఆహ్వానం పంపించినట్లు తెలిపారు.

ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు జూలై 29న భారత అంబాలా ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అయ్యాయి. ఇప్పటికే అవి లడఖ్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ యుద్ధ విమానాలు భారత సైన్యానికి మరింత పటిష్ఠతను చేకూర్చాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.