
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. పది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆగస్టు 2న ఆయనలో స్వల్పంగా వైరస్ లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో పాజిటివ్ అని రావడంతో వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజా పరీక్షల్లో నెగెటివ్ అని రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. వారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.





