
అయోధ్యలో రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా తిలకించింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కపోయారు. ఈ నెల 5న జరిగిన ఈ కార్యక్రమాన్ని సుమారు 16 కోట్ల మందికి పైగా టీవీల ద్వారా వీక్షించినట్లు ప్రసార భారతి సీఈవో శశి ఎస్ వెంపటి తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా 700 కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్ లభించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సుమారు 200 ఛానెళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయని శశి తెలిపారు. అయితే, ఇది కేవలం టీవీ ఛానెళ్ల వ్యూయర్‌షిప్ మాత్రమేనని పేర్కొన్నారు. అయితే, యూట్యూబ్ ద్వారా చూసిన వారి సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చు. అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు దూరదర్శన్ ప్రసారం చేసింది. ప్రధాని మోదీ ప్రసంగాన్ని పలు భాషల్లోకి అనువదించింది.





