
ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చే క్రమంలో ఓ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్ విమానాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ దాఫ్రా విమానాశ్రయానికి చేరుకొన్నాయి. మంగళవారం రాత్రి విమానాలు అక్కడ ఉన్న సమయంలో ఎయిర్ బేస్‌పై క్షిపణి దాడిని వెల్లడించే అత్యవసర సైరన్ మోగింది. అదే సమయంలో ఖతర్‌లోని అమెరికా వైమానిక స్థావరమైన అల్ ఉదైద్‌లో కూడా అలారం మోగింది. దీంతో అక్కడి బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులు అల్ దాఫ్రా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని సముద్రజలాల్లో కూలిపోయాయి. ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో భాగంగా వీటిని ప్రయోగించినట్లు తేలింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్, ఫాక్స్ న్యూస్‌కు చెందిన ప్రతినిధులు తమ అధికారిక ట్విటర్ ఖాతాల్లో వెల్లడించారు. కాగా “రఫెల్ విమానాలపై ఇరాన్ దాడికి యత్నించిందా?” అని కూడా కొందరు సందేహాలు వెలిబుచ్చుతున్నారు.
భారత్ చేరుకున్న రఫెల్ విమానాలు :
మొత్తానికి ప్రతిష్ఠాత్మకమైన రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌లో సురక్షితంగా దిగాయి. అబుదాబి అల్ దఫ్రా వైమానిక స్థావరం నుంచి ఐదు రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చాయి. 17వ వైమానిక స్క్వాడ్రన్‌లో రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఆగస్టు రెండో విడత భారత్‌కు మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు రానున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో రఫేల్‌కు స్థానముంది. అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా రక్షణశాఖ పరిగణిస్తోంది. ఏవియానిక్స్, రాడార్లు, అత్యుత్తమ ఆయుధ వ్యవస్థ కలిగిన రఫేల్ విమానం దక్షిణ ఆసియాలోనే అత్యంత శక్తిమంతమైన విమానం కావడం విశేషం.
ఇది నవశకానికి నాంది : రక్షణ మంత్రి
రఫేల్ ఫైటర్ జెట్‌లు భారత్‌కు చేరుకోవడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు సురక్షితంగా చేరాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ జెట్‌ల రాక భారత సైనిక చరిత్రలో సరికొత్త శకానికి నాందిగా ఆయన అభివర్ణించారు. భారత వైమానిక దళం సామర్థ్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ విమానాలు అందజేసిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. డసాల్ట్ ఏవియేషన్, ఫ్రెంచ్ కంపెనీలు సమయానికి విమానాలు చేరవేశాయని అభినందించారు.
ఈ విమానాలు మంచి పనితీరు కలిగి ఉన్నాయని రాజ్‌నాథ్ అన్నారు. అలాగే, దానిలోని ఆయుధాలు, రాడార్లు, ఇతర సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవన్నారు. ఈ ఫైటర్‌జెట్‌ల రాకతో దేశానికి ఎదురయ్యే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు దేశీయ వైమానిక సామర్థ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. భారత వైమానిక దళం అవసరాలను పూర్తిగా తీర్చేందుకే వీటిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ జెట్‌ల కొనుగోళ్లపై వచ్చిన నిరాధార ఆరోపణలపై ఇప్పటికే సమాధానం చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ మేరకు రఫేల్ ఫైటర్ జెట్‌లు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్ అయిన వీడియోను ట్వీట్ చేశారు.





