
రెండు రోజుల ముందు అజమ్ ఘర్ జిల్లాలోని మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దళిత వ్యక్తులపై దాడి చేసిన 16 మంది ముస్లిం యువకులను ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సికందర్‌పూర్ ఐమా గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో 12 మంది దళితులు గాయపడ్డారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనను తెలుసుకుని, నిందితులపై జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలని పోలీసులను ఆదేశించిన కొద్ది గంటలలోనే పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
కొంతమంది బాలికలను వేధించారనే ఆరోపణలతో కొందరు దళిత యువకులు నిందితులను ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సుధీర్ అనే 22 ఏళ్ల వ్యక్తిపై పదునైన ఆయుధంతో నిందితులు దాడి చేశారు. మరో 11 మందిని కర్రలు, రాళ్ళతో కొట్టి గాయపరచారు. వైద్యుల ప్రకారం, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
ఇదిలావుండగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మహారాజ్‌గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరవింద్ పాండేను అజమ్ ఘర్ ఎస్ఎస్‌పి త్రివేణి సింగ్ సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను పట్టుకోవటానికి వారిపై తలకు రూ .25 వేల రూపాయల రివార్డును ప్రకటించారు. సికందర్‌పూర్ ప్రాంతంలో పోలీసులను మొహరించారు.
అదనపు ఎస్పీ నరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, “ఈ 16 మంది నిందితుల్లో ఒకరు మైనర్, అతనిని శనివారం కోర్టులో హాజరుపరుస్తాం” అని తెలిపారు.
నిందితులు గ్రామంలోని గొట్టపు బావి వద్ద కూర్చుని, పాఠశాలకు వెళ్లే దారిలో ఆ ప్రాంతం గుండా వెళుతున్న దళిత బాలికలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఎస్ఎస్‌పి సింగ్ పేర్కొన్నారు.
బుధవారం కూడా నిందితులు ఇలాంటి వ్యాఖ్యలే చేయగా దళిత వర్గానికి చెందిన కొందరు వారి ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్ది నిమిషాల తరువాత, నిందితులు దళిత ప్రాంతంపై మూకుమ్మడిగా దాడి చేసినట్లు సమాచారం. వారు ఆ ప్రాంత ప్రజలపై దాడి చేశారని, మహిళలపై రాళ్ళు రువ్వారని తెలిపారు.
Source : The Indian Express





