
భారతో సరిహద్దు వివాదం విషయంలో చైనా చాలా దూకుడుగా వ్యవహరించిందని, అయితే దీనికి భారత్ అదేస్థాయిలో బదులిచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ”గత నెలలో గల్వాన్ ఘటన గురించి భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పలుమార్లు మాట్లాడాను. చైనా చాలా దూకుడుగా వ్యవహరించింది. భారత్ కూడా తనకు వంతుగా దీటుగానే బదులిచ్చింది” అని చైనా సరిహద్దుల విస్తరణకు సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
త్వరలోనే షీ జిన్‌పింగ్ పార్టీ నుంచి పొంచి ఉన్న ముప్పును ప్రపంచం అర్థం చేసుకుంటుందని తనకు గట్టి నమ్మకం ఉందని పాంపియో అన్నారు. డ్రాగన్ దేశం త్వరలోనే ఒంటరి అవుతుందని పేర్కొన్నారు. అలానే చైనా చర్యలకు సరైన రీతిలో స్పందించేందుకు అన్ని దేశాలూ కలిసి వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు.
గత నెలలో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దురాక్రమణలను భారత్ సైన్యం అడ్డుకుంది. అందులో భాగంగా జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అప్పటి నుంచి ఇరు దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రెండు గంటల పాటు మాట్లాడారు. దీంతో చైనా తన బలగాలను సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉపసంహరించుకుంది. అయితే చైనా ఉపసంహరణ ప్రక్రియను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఒక వేళ చైనా మరోసారి దుందుడుకు చర్యలకు దిగితే దీటుగా బదులిచ్చేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.





