News

భారత సైనికుల దెబ్బకు వెన్ను చూపిన చైనా సైనికులు

840views

చైనా సైనికుల చెర నుంచి విడుదలైన పది మంది భారత జవాన్లకు నిర్వహించిన మానసిక, వైద్యారోగ్య పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గల్వాన్‌ ఘటన తర్వాత శత్రుదేశ సైనికులు చాలా భయపడ్డారని తెలిసింది. ఇద్దరు మేజర్‌ స్థాయి అధికారులు, ఇద్దరు కెప్టెన్లతో సహా పది మంది భారత సైన్యం గల్వాన్‌ ఘటన తర్వాత ప్రత్యర్థులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విడుదలైన వారికి తాజాగా మానసిక, వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులపైనే ప్రత్యర్థి చేతిలో బందీ అయినా, వారంతా చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. ఈనెల 15న రాత్రి గల్వాన్‌ ఘటనలో కర్నల్‌ సంతోష్‌బాబు వీర మరణం పొందారని తెలిశాక భారత సైన్యం తిరగబడింది. చైనా సైనికులపై ప్రతిదాడి చేసింది. ఈ క్రమంలోనే పొరుగు దేశ సైనికులు భయపడి తమ భూభాగంలోకి పరిగెత్తారట. వారిని వెంబడిస్తూ వెళ్లిన మన సైనికులు బందీలుగా చిక్కారు. ఈ ఘటన భారత సైనికుల ధైర్య సాహసాలను తెలియజేస్తుందని ఓ ఉన్నతాధికారి అన్నారు.

ఆ రాత్రి జరిగిన ఘటనలో భారత్‌ నుంచి ప్రతిదాడి ఎదురవుతుందని, తొలుత చైనా సైన్యం ఊహించలేకపోయిందని, భారత జవాన్లు తిరగబడేసరికి వారు చాలా భయపడ్డారని ఈ పది మంది జవాన్లకు నిర్వహించిన పరీక్షల్లో తేలిందని చెప్పారు. ఆ ఘటన తర్వాత భారత్‌ నుంచి పెద్ద స్థాయిలో ప్రతిదాడి జరుగుతుందని భావించిన చైనా సైన్యాధికారులు వణికిపోయినట్లు తెలిసిందన్నారు. అలాగే భారత జవాన్లు బందీలుగా ఉన్న సమయంలోనూ వాళ్లకేం చేయాలో అర్థంకాలేదని తెలిపారు. మరోవైపు ఇంటెలిజెన్స్‌ సమాచారం ప్రకారం.. గల్వాన్‌ ఘటనలో అమరులైన భారత జవాన్లకు ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగింపులు, అంత్యక్రియలు జరిగిన వీడియోలు, చిత్రాలను చైనా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని, అదే సమయంలో చైనా అధికారులు మాత్రం చనిపోయిన తమ సైనికుల సమాచారం ఇప్పటివరకూ తెలియజేయలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని ఆ అధికారి పేర్కొన్నారు. అలాగే చైనా ఇప్పటివరకు నిజమైన యుద్ధాలను చేయలేదని, అలాంటి పరిస్థితులు తలెత్తితే వాస్తవంగా ఏం చేయాలో కూడా దానికి తెలియదన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికే చిన్న చిన్న వాటిని పెద్దగా చూపిస్తోందని విమర్శించారు. జూన్‌ 15 రాత్రి నిజమైన భారత సైన్యాన్ని చూసిందని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.