
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తున్నాయి. ఉదయం శ్రీనగర్‌లో ఒక ముష్కరుణ్ని హతం చేసిన దళాలు.. తాజాగా మరో ముగ్గురిని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని జూమినార్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో సైనిక బలగాలతో కలిసి కశ్మీర్ పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ భవనంలో నక్కిన ముష్కరులు దళాలపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి.
ముష్కరుల తల్లిదండ్రుల్ని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి వారిని లొంగిపొమ్మని చెప్పించినప్పటికీ వారు దానికి నిరాకరించినట్లు సమాచారం. దీంతో చేసేది లేక.. బలగాలు కాల్పులు కొనసాగించడంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు 2019లో ఉగ్రవాదంలో చేరినట్లు సమాచారం. మరొకరు గత నెల బీఎస్‌ఎఫ్ జవాన్ల వాహనంపై జరిపిన కాల్పుల్లో పాల్గొన్నట్లు ఓ అధికారి తెలిపారు. మరో ఘటనలో షొపియాన్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఓ ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో నేడు మొత్తం నలుగురు ముష్కరుల్ని బలగాలు మట్టుబెట్టాయి.





