ArticlesNews

భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపజేసిన రాణీ అహల్యా దేవి హోల్కర్

1.1kviews

హల్యా దేవి హోల్కర్ (1725 మే 31 – 1795 ఆగస్టు 13)  మహారాష్ట్రలోని చొండి గ్రామపెద్ద మణికోజీ షిండే పటేల్ కుమార్తె. ఆమె 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాజైన మల్హర్ రావు కుమారుడు ఖండేరావు హోల్కర్ ను వివాహమాడింది. ఈ దంపతుల పుత్రుడు మాలేరావు హోల్కర్.

వివాహమైన కొంతకాలానికి ఖండేరావు మొగలాయీలతో 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో మరణించాడు. సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యా బాయిని మామ మల్హర్ రావ్ అడ్డుకున్నాడు.ఆయన అహల్యా బాయికి యుధ్ధవిద్యలలో, రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు. మరో పన్నెండు సంవత్సరాల తర్వాత 1766వ సంవత్సరంలో ఆమె మామ మల్హర్ రావు హోల్కర్ మరణించారు. 1767వ సంవత్సరంలో తన ఏకైక కుమారుడు మాలేరావు కూడా మరణించడంతో ఆమె స్వయంగా రాజ్యపరిపాలనా బాధ్యత చేపట్టింది.

ఒక స్త్రీ పాలనా బాధ్యతలు చేపట్టడంపట్ల రఘోబా వంటి మరాఠా సర్దార్లు అభ్యంతరం చెప్పినప్పటికీ, నాటి పీష్వా మాధవరావు అండతో ఆమె ఇండోర్ పాలనా బాధ్యతలు చేపట్టారు. 1767వ సంవత్సరం నుండి 1795వ సంవత్సరం వరకు 28 ఏళ్ళ పాటు ఆమె ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించారు. ఆమె పరదా పధ్ధతిని (ఘోషా) పాటించలేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. తుకోజీ హొల్కర్ ను సుబేదార్ గా నియమించారు. సామంత నాయకులు అమెకెంతో గౌరవమిచ్చేవారు. ఆమె ఇండోర్ రాజ్యాన్ని విస్తరింపచేశారు. రాజధానిని నర్మదా నది ఒడ్డున కొత్తగా నిర్మించిన మహేశ్వర్ కి మార్చారు. మధ్యభారత మాళ్వా ప్రాంతాన్ని మహేశ్వర్ రాజధానిగా శాంతి సౌభాగ్యాలతో పరిపాలించారు. యుధ్ధవిద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచారు. వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశారు. కాలువలు, చెరువులు త్రవ్వించి వ్యవసాయ అభివృధ్ధికి పాటుపడ్డారు. మహేశ్వర్ నేత కార్మికులను ప్రొత్సహించి మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోనికి తెచ్చారు. ఈనాటికీ మహేశ్వరం చీరలు మహారాష్ట్రలోనే కాక భారతదేశమంతటా ప్రసిద్ధి.

ఇండోర్ ను కైవసం చేసుకోవడానికి ప్రయత్నించిన పూనా ప్రభువు రఘునాథరావు పీష్వా ప్రయత్నాలను అహల్యాదేవి రాజనీతిజ్ఞతతో వ్యవహరించి విఫలం చేశారు. థగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి కూడా ఆమె తన రాజ్యాన్ని రక్షించుకున్నారు. ఆమె యుద్ధాలలో తానే సైన్యానికి నాయకత్వం వహించి ముందుకు నడిపేవారు.

పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. ఆమె శివుని భక్తురాలు. మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించారు. కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్ ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని అలయాలను పునరుద్ధరించారు. వీటికి ప్రజాధనాన్ని కాకుండా తన స్వంత ధనాన్ని వినియోగించి భారతీయ సంస్కృతి పునరుత్థాన కార్యాన్ని నిర్వహించి మార్గ దర్శకురాలైనారు. ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేశారు. మన దేశంలో ఎన్నో తీర్థ క్షేత్రాలు సందర్శించేటప్పుడు ఆ మహనీయురాలు స్మరణకు రావడం అతి సహజం.

భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది. ఇండోర్లోని విమానాశ్రయానికి “దేవి అహల్యా బాయి హోల్కర్” విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఆమె కర్తృత్వశక్తి మనకు సదా అనుసరణీయం.

భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపజేసిన రాణీ అహల్యా దేవి హోల్కర్ జయంతి నేడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.