
1.5kviews
అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టనున్న స్థలానికి సమీపంలో శివలింగం, దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కి ఉన్న ధ్వజాలు తాజాగా బయటపడ్డాయి. ఆలయ నిర్మాణం కోసం వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా అవి వెలుగుచూశాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. బయటపడ్డవాటిలో ఐదు అడుగుల శివలింగం, నల్ల గీటురాయి స్తంభాలు ఏడు, ఎర్ర రాతిఇసుక ధ్వజాలు ఆరు, పలువురు దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. పది రోజులుగా ఆలయ నిర్మాణ స్థలం వద్ద పనులు జరుగుతుండగా వీటితోపాటు కలశం, రాతి పుష్పాల వంటి అనేక ప్రాచీన వస్తువులు కనిపించాయని విశ్వహిందూ పరిషద్(వీహెచ్‌పీ) అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం వెలుగుచూసినవన్నీ అయోధ్యలోని పురాతన రామాలయానికి సంబంధించినవేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





