
బ్రిటన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న భారతీయ విద్యార్థిని కామాక్షికి చేదు అనుభవం ఎదురైంది. ఆక్స్‌ఫర్డ్ నగరంలో షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఓ శ్వేతజాతీయురాలు తన శరీరం నుంచి దుర్వాసన వస్తోందంటూ అవమానకర వ్యాఖ్యలు చేసిందని ఆమె వెల్లడించారు. ఈ ఘటనను వివరిస్తూ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తన చుట్టూ ఓ మహిళ పదేపదే తిరుగుతూ అసహనంగా ప్రవర్తించిందని కామాక్షి తెలిపారు. అనంతరం తన వద్దకు వచ్చి.. ‘‘నీ నుంచి చాలా దుర్వాసన వస్తోంది’’ అంటూ అవమానించిందని పేర్కొన్నారు. ఆ మాటలు విన్న తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన తనను మానసికంగా తీవ్రంగా కలచివేసిందని కామాక్షి వెల్లడించారు. తాను ఉపయోగించే పెర్ఫ్యూమ్‌ను తన తండ్రి కూడా ఉపయోగించేవారని, ఆ సువాసనతో తనకు ఎంతో భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపారు. అలాంటి సువాసనను సైతం అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు. ఈ ఘటన తర్వాత రోజంతా బాధతో గడిపానని చెప్పారు.
గతంలోనూ సోషల్ మీడియాలో తనపై జాత్యహంకార వ్యాఖ్యలు వచ్చాయని కామాక్షి గుర్తుచేశారు. ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల పరిసరాల్లో కూడా ఇతర దేశాలు, జాతులకు చెందిన విద్యార్థులు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వీధుల్లో ఎదురయ్యే అవమానాల నుంచి సంస్థాగత స్థాయిలో కనిపించే వివక్ష వరకు అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే, ఇలాంటి అవమానాలు ఎదురైనంత మాత్రాన తన సాంస్కృతిక గుర్తింపును వదులుకునేది లేదని కామాక్షి స్పష్టం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవంతో నిలబడాలని, వివక్షకు వ్యతిరేకంగా గొంతు వినిపించాలని ఆమె అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న జాతి వివక్ష సమస్యపై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.




