
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపైనున్న దీపస్తంభంపై శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీపస్తంభం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కర్రలతో తాత్కాలిక నిర్మాణ పనులను చేపట్టారు. ఆలయ పూజారులు, తదితరులు దీపాన్ని వెలిగించేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ఇప్పటికే కొండ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి దర్గా చుట్టూ 50 మీటర్ల బఫర్ జోన్‌ను ఏర్పాటు చేశారు. అంతకుముందు సీఆర్పీఎఫ్ సిబ్బందికి స్థానికులు, భక్తులు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.
తిరుప్పరంకుండ్రం ఆలయ నిర్వహణ బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్లకు సుప్రీంకోర్టు అప్పగించిన నేపథ్యంలో.. వారు మదురైకి చేరుకున్నారు. తాము కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు.. స్థానికులతో పాటు కేరళ నుంచి వచ్చిన దాదాపు 100 మంది శనివారం ఉదయం తిరుప్పరంకుండ్రం కొండపైనున్న దర్గా వద్ద ప్రార్థనలు చేశారు. మరో 100 మందికి పైగా బృందం కూడా రానుందని అంచనా. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి.





