
శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా 10వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ్ మహాసమ్మేళనం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమైంది. ‘A Celebration of Being and Becoming’ (ఉన్న స్థితి నుంచి ఉన్నత దివ్య స్థితికి ప్రయాణం) అనే ప్రధాన ఇతివృత్తంతో రెండు రోజుల పాటు ఈ మహాసమ్మేళనం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 10,000 మంది సేవాదళ్ ప్రతినిధులు ఈ ఆధ్యాత్మిక సమావేశానికి హాజరయ్యారు.
ప్రారంభ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్, ట్రస్టీలు శ్రీ కే. చక్రవర్తి, శ్రీ ఎస్.ఎస్. నాగానంద్, భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా జ్యోతి ప్రజ్వలన చేసి మహాసమ్మేళనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జాయింట్ నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్ (పురుషులు) శ్రీ చంద్రశేఖరన్ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ సమావేశ ఇతివృత్తంలోని ప్రేమ, సేవ, దైవత్వం అనే మూడు ప్రధాన అంశాలను వివరించారు. ఈ మహాసమ్మేళనం కేవలం సంస్థాగత సమావేశం మాత్రమే కాదని, భగవాన్ బోధనలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకుని, తమ జీవిత లక్ష్యాన్ని తెలుసుకునే పవిత్రమైన అవకాశమని పేర్కొన్నారు. స్వామి ఆదర్శాలను నిత్య జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా ప్రారంభోపన్యాసం చేస్తూ.. ఈ మహాసమ్మేళనం భగవంతుని పట్ల భక్తి, అంకితభావం, సంపూర్ణ శరణాగతిని చాటిచెప్పే ఆధ్యాత్మిక వేడుక అని అన్నారు. ప్రతి సేవాదళ్ సభ్యుడు, బాలవికాస్ గురువు, విద్యార్థి సమాజంలో సానుకూల మార్పునకు వెలుగుదివ్వెగా నిలవాలని ఆకాంక్షించారు.
నిస్వార్థ సేవ ప్రాధాన్యతను వివరిస్తూ.. న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం తమ హోదాలను పక్కనపెట్టి సాధారణ సేవా కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటారని గుర్తుచేశారు. సేవ అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలని, అప్పుడప్పుడు చేసే కార్యక్రమంగా కాకుండా జీవితంలో అంతర్భాగంగా మారాలని సూచించారు.
సేవ చేస్తున్నామనే అహంకారం ఎప్పటికీ ఉండకూడదని, ప్రతి ఒక్కరూ భగవంతుని చేతిలో ఒక సాధనం మాత్రమేనని గుర్తించాలని అన్నారు. సేవకు నిజమైన ప్రతిఫలం ప్రశంసలు, పురస్కారాలు కాదని, నిస్వార్థ సేవ ద్వారా లభించే మనశ్శాంతి, ప్రేమ, ఆనందమేనని వివరించారు.
ముఖ్య ఉపన్యాసకులుగా పాల్గొన్న శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని, మధురమైన జ్ఞాపకాలను సభికులతో పంచుకున్నారు.
హనుమంతుడు, శ్రీకృష్ణుడు, పద్మపాదుల జీవితాలను ఉదాహరణగా వివరిస్తూ.. భగవంతునికి, గురువుకు వినయంతో చేసే సేవ ఆధ్యాత్మిక ఉన్నతికి గొప్ప మార్గమని జస్టిస్ రామసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నారదుడు నిరంతరం శ్రీరామ నామాన్ని జపించగా, హనుమంతుడు తన సేవ ద్వారా శ్రీరామునిపై భక్తిని చాటుకున్నారని వివరించారు.
ఆధ్యాత్మిక ప్రగతిలోని నాలుగు దశలైన సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం గురించి వివరిస్తూ, భగవంతునితో సంపూర్ణ ఐక్యత సాధించడమే ఆధ్యాత్మిక ప్రయాణానికి పరమావధి అని పేర్కొన్నారు.
సేవాదళ్ సభ్యుడిగా ఉండటంలోని గొప్పతనం హోదాలోనో, అధికారంలోనో లేదని, వినయం, శరణాగతి, ప్రేమతో కూడిన నిస్వార్థ సేవలోనే అసలైన గొప్పతనం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
మహాసమ్మేళనం కార్యక్రమాలు సేవాదళ్ ప్రతినిధుల్లో ఆత్మపరిశీలన, సేవాభావం, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమను సేవ ద్వారా వ్యక్తపరచాలని, నిస్వార్థ సేవ ద్వారా దైవత్వాన్ని అనుభవించాలని ఈ సమావేశం మరోసారి చాటిచెప్పింది.





