
గోదావరి పుష్కర స్నానాలకు ప్రత్యేకంగా ఎలాంటి ముహూర్తం అవసరం లేదని దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా నిర్ణయించిన 12 రోజుల పాటు భక్తులు ఏ సమయంలోనైనా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించవచ్చని తెలిపారు. ఈ విషయంలో వైదిక పండితులంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని వెల్లడించారు.
పుష్కరాల తొలిరోజు సూర్యోదయం నుంచి చివరిరోజు సూర్యాస్తమయం వరకు ఏ ఘడియలోనైనా పవిత్ర గోదావరిలో స్నానం చేయవచ్చని వివరించారు. పుష్కరాల సమయంలో గోదావరి నదిలోని ఏ ఘాట్ వద్ద స్నానం ఆచరించినా పుణ్యఫలం లభిస్తుందని పేర్కొన్నారు. పుష్కర ముహూర్తం, ఇతర ఏర్పాట్లపై రాజమహేంద్రవరంలోని దేవదాయశాఖ ఆర్జేసీ కార్యాలయంలో గురువారం పండితులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈసారి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
పుష్కరాల సందర్భంగా ఆరు జిల్లాల పరిధిలోని గోదావరి ఘాట్లను అభివృద్ధి చేసి, భక్తులు సురక్షితంగా పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.దేవదాయశాఖ ఆధ్వర్యంలో మొత్తం రూ.126 కోట్ల అంచనా వ్యయంతో 563 అభివృద్ధి పనులను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. వీటిలో 520 పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించాయని చెప్పారు.
టెండర్లు పూర్తయిన 400కు పైగా పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని, మిగిలిన పనులను కూడా వేగవంతం చేస్తామని తెలిపారు. 2027 మార్చి నెలాఖరులోగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన పుష్కర అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.





