
భావ సమైక్యత దేశ సమైక్యానికి రాచబాట. కనుకనే, ఇతర భాషలలో జరిగే సాహిత్య వ్యాసంగాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనకు మిల్టన్, టాల్‌స్టాయ్, షేక్స్పియర్ మొదలైన సాహితీమూర్తుల్ని గురించి పరిపూర్ణంగా కాకపోయినా కొంతవరకైనా తెలుసు. కాని, తెలుగు తోబుట్టు భాషల్ని గురించి, ఆ భాషలలో ఎనలేని సేవలను చేసినవారిని గురించి అసలే తెలియదు. కనుక, వారిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేశభక్తి ఎంత అవసరమో, దేశస్తుతి కూడా అంతే అవసరం. ఇది నా తల్లిదండ్రులు నా తాతముత్తాతలు వారి పూర్వులు ఎందరెందరో విహరించిన దేశం, కనుకనే, ప్రతీవ్యక్తి దేశస్తుతి (నాట్టు వణక్కం) కావించాలి. ఎందరెందరో మహనీయులు పుట్టి పెరిగి మట్టిలో మట్టిగా కలిసిపోయారు. ఈ దేశంలో ఎన్నో గుళ్లు, గోపురాలు వెలిశాయి. యీ దేశంలో మనిషి పెరిగి పెద్దవాడు కావడానికి తోడ్పడేది దేశం. అటువంటి దేశాన్ని నోరారా వందేమాతరం అని స్తుతించవద్దా మరి అన్నారు సుబ్రమణ్యభారతి. ‘‘నా తల్లిదండ్రులు నవ్వుతూ పాడుతూ / నివసించిరి.. యీ దేశంలో/ వారి పూర్వులు తరతరాలుగా / నివసించిరి యీ దేశంలో/ వారి చింతనలో విరిసిన తలపులు/ వికసించెను యీ దేశంలో/ నిన్ను మనసులో నిలిపి నోరారగ/ అభినందించవలదా?/ జీవమిచ్చి జన్మమిచ్చి పోషించి / దయజూపినదీ యీ దేశం/ తల్లులు పుట్టి తొక్కు పలుకులు నేర్పి/ తెలివి యిచ్చినదీ దేశం / కన్నెపడుచులై వెన్నెలలో ఆటలాడి/ మురిసిపోయినదీ యీ దేశం’’ అంటూ కొనియాడిన వైనం మరువలేనిది.
తమిళనాడుకు చెందిన మహాకవి సుబ్రమణ్య భారతి (భారతీయార్) దేశభక్తి, సంఘ సంస్కరణ, ఆధునిక కవిత్వ శైలికి ప్రసిద్ధి. తెలుగు సాహిత్యంలో ఆయనతో సమానమైన స్థానం, భావాలు ఉన్న కవులను పరిశీలిస్తే, గురజాడ అప్పారావు, గరిమెళ్ల సత్యనారాయణ, శ్రీశ్రీలతో ఆయన్ను పోలుస్తారు.
సుబ్రమణ్యభారతి తమిళ సాహిత్యంలో ఆధునిక యుగానికి, వచన కవిత్వానికి ఎలాగైతే ఆద్యుడో, తెలుగులో గురజాడ అప్పారావు కూడా ఆధునిక కవిత్వానికి, భాషాఉద్యమానికి మార్గదర్శి. తన రచన కన్యాశుల్కం ద్వారా, దేశమంటే మట్టికాదోయ్ అనే కవిత ద్వారా సామాజిక సంస్కరణ ప్రబోధించాడు. గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ‘‘మాకొద్దీ తెల్లదొరతనం’’, భారతి రచనకు సమానమైన తీవ్రతను కలిగి ఉంటుంది. మహాకవి భారతి సమాజంలోని పీడిత ప్రజల తరుపున సమ సమాజం కోసం కవిత్వం రాయగా శ్రీశ్రీ మహాప్రస్థానం ద్వారా అభ్యుదయ, విప్లవభావాలను చాటారు.
భారతియార్లాగే దేశభక్తిని రగిలించి, సామాజిక సమానత్వం కోసం కలం పట్టిన కొందరు ప్రముఖ హిందీకవులలో రాంధారీసింగ్ దినకర్‌ను రాష్ట్రకవి అని పిలుస్తారు. ఉగ్రరసం,దేశభక్తి దినకర్ రచనలలో కనిపిస్తాయి. వారి ప్రముఖ రచనలలో కురుక్షేత్ర, రశ్మీరథ•, ఊర్వసి ఉన్నాయి.
మైథిలీశరణ్ గుప్తా భారత స్వాతంత్రోద్యమంలో ప్రజలను అమితంగా ప్రభావితం చేసిన మరో గొప్ప హిందీకవి. వీరి రచనలు భారత్-భారతి, సాకేత్. హిందీ సాహిత్యంలో చాయావాద యుగానికి చెందిన విప్లవాత్మక కవి సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా. వీరి ముఖ్య రచనలు పరిమళ్, అనామిక, కూకుర్ముత్తా. మరొక కవి మూఖన్లాల్ చతుర్వేది.. హిందీ సాహిత్యంలో వీరిని ఏక్ భారతీయ ఆత్మ అని పిలుస్తారు. వీరి ప్రముఖ రచన పుష్ప్కీ అభిలాష ఒక పువ్వు దేశభక్తిని చాటే ప్రసిద్ధ కవిత. పుష్ప కీ అభిలాషలో ఒక పుష్పం దేవతలకైనా లేదా రాజుల అలంకరణకైనా ఉపయోగపడాలనీ కోరుకోకుండా దేశం కోసం ప్రాణాల ర్పించే సైనికులు నడిచే మార్గంలో రాలాలని కోరుకుంటుంది.
పుష్పకీ అభిలాష (పువ్వు కోరిక) ప్రసిద్ద కవితలోని మొదటివాక్యం ‘‘చాహ్ నహీ మై సురబాలా కే గహనో మే గుంథా జావూ’’ (ఒక పూసలా దేవ కన్యల ఆభరణాల కూర్పులో ఇమడాలనే కోరిక నాకు లేదు) అని మొదలవుతుంది. తెలుగులో పుష్ప విలాపం పేరుతో కరుణశ్రీ పుష్పాల ఆత్మలను గురించి రాశారు.
జయశంకర్ ప్రసాద్ హిందీ ఆధునిక కవిత్వంలో అత్యున్నత శిఖరంలాంటి వాడు. ఆయన రాసిన ‘‘కామాయినీ’’ మానవ పరిణామాన్ని జాతీయ చైతన్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.
మన జాతీయ గీతం ‘వందేమాతరం’ మాతృదేశ స్వరూప స్వభావాలను వివరిస్తూ కావ్యస్ఫూర్తిని సంతరించుకున్న మహా కావ్యరేఖ. అందులో ‘‘సుమధుర భాషిణీం’’ అని దేశమాతను స్తుతించాడు బంకించంద్ర చటర్జీ. భారతీయ భాషలు ఒకే ఆత్మకు మారు రూపాలు, మధురమైన ధ్వనులకూ, గంభీరమైన అర్థాలకు, సమున్నతమైన విజ్ఞాన సంపదకు, అపారమైన జీవితానుభవానికి అవి రుజువులు.
భారతీయ భాషలలో వైవిధ్యమున్న మాట నిజమే. ఆ వైవిధ్యం తోటలోని రకరకాల పువ్వులలాగా, అందాలను పరిమళాలను పంచిపెడుతుంది. పలు భాషలు నేర్చినవాడు సమైక్య భావాన్ని పెంపొందించడంలో ఎంతగానో దేశానికి, జాతికి ఉపయోగపడతాడు. తమిళం భారతదేశంలో అతి ప్రాచీనమైన భాష, సాహిత్య విజ్ఞాన సంపదలకు కాణాచి. అటువంటి భాషలో ప్రసిద్ధ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి.
‘‘కుండ కుంభమండ్రు, కొండ పర్వతమండ్రు / ఉప్పు లవణమండ్రు ఒకటి గాదె / భాషలింతే వేరు, పరతత్వమొక్కటే / విశ్వదాభిరామ వినురవేమ’’ అని ప్రజాకవి వేమన చెప్పగా, మరొక ప్రజాకవి సుబ్రమణ్య భారతి ఇలా అన్నాడు.. ‘‘చెప్పు మొళి పదినెట్టు డైయాళ్, ఎనిన్ / చిన్దనైబన్డ్రుడై యాళ్’’ (పద్దెనిమిది భాషలు కలది, భావంలో ఏకత్వం కలది). భాషలు భిన్నమైనా వాటిలో వివరించే విషయాలలో ఏకత్వం ఉంది. తమిళ నవయుగ ప్రవక్త సుబ్రమణ్య భారతి జీవించింది 39 సంవత్సరాలే (1882-1921) ఆ కొద్దికాలంలోనే కవితలు, కధలు, వ్యాసాలు, అనువాదాలు ఎన్నో సంతరించి తమిళసాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు.
తమిళ సాహిత్యంలో సంగమ యుగం ప్రధానమైనది. దానితో అగస్త్యుడు, తొలి కప్పియ్యార్, నక్కిరుడు, తిరువళ్లువార్ ఇలా ఎందరో ప్రసిద్ధ ప్రాచీన కవులు. అలాగే కంబ (రామాయణం) ప్రసిద్ధి చెందగా, ఆధునికులలో సుబ్రమణ్య భారతికి జాతీయ కవిగా అంతటి గుర్తింపు వచ్చింది.
సుబ్రమణ్య భారతి తిరునల్వేలి జిల్లాలోని వట్టాయపురంలో 1882 డిశంబర్ 11న జన్మించారు. తండ్రి చిన్నస్వామి అయ్యర్, తల్లి లక్ష్మి అమ్మాళ్. 1904లో మధురలోని సేతుపతి ఉన్నతపాఠశాలలో తమిళ పండితునిగా పనిచేశాడు. 1908లో మొదటి రచన ‘‘స్వదేశ గీతంగళ్’’ వెలువడింది. 1912లో భగవద్గీతను తమిళం చేశాడు. బ్రిటిష్ వారు భారతిని అరెస్టు చేయగా, కొన్నాళ్ళు జైలులో ఉన్నాడు. తరువాత స్వదేశీమిత్రన్ పత్రిక కార్యాలయంలో చేరాడు. 1921 సెప్టెంబర్ 11 రాత్రి కన్నుమూశాడు. భారతి తన జీవిత లక్ష్యాలను ఇలా చెప్పాడు.. ‘‘కవిత, దేశసేవ, క్షణ కాలమైనను / బద్ధకమ్ము లేమి పనులనంగ/ ఇవియె నాకు మనస! ఈ మూడు చేయుము / అపుడు సదయుడగును – ఆ గణపతి’’ (విఘ్నేశ్వర స్తోత్రము).
భారతి కవితల్ని దేశభక్తి కవితలు లేక జాతీయగీతాలు, తాత్విక గీతాలు, ఇతరాలుగా విభజించవచ్చు. వాటికి గేయాంశ జీవం పోసింది వందేమాతరం, స్వాతంత్య్ర దాహం, తమిళ భాషాస్తవం, ఛత్రపతి శివాజీ, గురుగోవింద్ సింగ్, తిలక్ మొదలైనవి.
స్వతంత్రం, స్వేచ్ఛా జీవనం అంటే ఎంతో ఇష్టం, ప్రపంచంలో ఎవరికి స్వతంత్య్రం వచ్చినా సంతోషించేవాడు. కృష్ణుణ్ణి స్తుతిస్తూ కూడా
ఎన్డ్రు తణియు మింద సుదందిర దాగం
ఎన్డ్రు మడియు మెంగళ ఆడి మైయిల్ మోగం
ఎన్డ్రె మదన్నై కైవిలంగుగళ్ పోగుం
ఎన్డ్రెమ దిన్నళ్ల గళ్ తీరున్దు పొయ్యాగుం? అన్నాడు.
అంటే ఎప్పుడు తీరు నీ స్వాతంత్య్ర దాహం/ ఎప్పుడు మడియు మా అడియరి మోహం ఎప్పుడు బానిసత్వ మోహం నశిస్తుంది/ ఎప్పుడు మా యిక్కటులన్నీ తీరిపోవు?
భారతి రాసిన వందేమాతరం గేయంలో మనలో భిన్న జాతులున్నప్పటికీ ఏకోదరుల వలె సంచరించాలనీ, వారితో ఐకమత్యం నెలకొనాలనీ ఆయన ఉద్బోధించాడు.
‘‘వందేమాతరమని పలికేము – మన మంతా మన తల్లిని కొలిచేము.. జాతిమతాలు నిరసించేము… సఖ్యత లోపిస్తే అవమానము మిగిలేను… బానిస బ్రతుకుని ‘ఛీ’ అందాము’’.
అఖండ భారతాన్ని దర్శించిన అకళంక దేశభక్తుడు భారతి. ‘‘రజిత హిమాద్రి తిరిగేము / కడలిని ఓడలు నడిపేము / బడినేమో గుడిగా మలిచేము / భారతమని భుజాలు చరిచేము… కాశీ విద్వాంసులు జరిపే చర్చలు / కంచిలో ప్రతిధ్వనించగా చేసేము/ రాజపుత్ర వీరాగ్రణులకు/ కన్నడపు పసిడిని కానుకగా యిచ్చేము.
కల్లకపటములంటేనూ భారతికి మహామంట. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే స్వభావం ఆయనది. చెప్పే మాటలకి, చేసే చేతలకూ మధ్య పొత్తు కుదరాలని ఆయన ఆశయం. తద్భిన్నంగా వ్యవహరించే కుహనా దేశభక్తుల్ని ‘‘నడిపుచూ దేవిగళ్’’ అనే కవితలో తూర్పారబట్టాడు. దాని అనువాదం చూడండి.. గుండె దిటవూ సత్యదృష్టీ లేవ్. మాయమాటలు పలికేరు చిలకా, వట్టి వదరుబోతులే వారు, గుంపులో కలిసి అది చేరుగాని మనసుకేమీ పట్టించుకోరు – చిలకా, మరచిపోతారు వెనువెంటనే స్వరాజ్య సౌఖ్యం సమకూరేనా, గుడ్డి వారికెపుడైనా – చిలకా, స్వదేశీ కబురు చెపుతూ తిరిగేరు చిలకా, కల్లు మీద మనసుంచి శివ శివా అన్నట్లు వందే మాతరమనేరు – చిలకా.
తమిళ భాషను గురించి భారతి చెప్పిన కవిత అందరూ పరిశీలించదగినది. ఇతర భాషా రచనలు తమిళంలోనికి రావాలని గాఢంగా ఆశించాడు. మన పాత కధలు మననం చేసుకుంటూ కూర్చోవడం వలన ఏమీ లాభం లేదని. ఇది అన్ని భాషల వారికి వర్తిస్తుంది.
బాలల గురించి చెపుతూ పరుగెత్తాలి, ఆడాలి పాపా నువ్వు/ బద్దకం మానాలి పాపా/ కలిసి మెలిసి ఆడాలి పాపా – ఎవ్వరిని ఏమీ అనబాకు పాపా అంటూ భారతి రాశారు.
జాతీయవాదుల్ని అలనాటి తెల్లదొరలు మాటలతో, చేతలతో పరాభవించా రని, చిదంబరం పిళ్లైయిని ఉద్దేశించి చెప్పిన మాటలు ‘తెల్లదొరల ప్రగల్బాలు’ అనే కవితలో వివరించారు. అస్వతంత్రులుగా సంచరించే మనుషులలో స్వతంత్ర వాంఛ నెలకొనినట్లు చేశారు ఆనాటి జాతీయవాదులు. భీరులైన ప్రజల్ని ధీరులుగా తీర్చిదిద్దారు. దాస్యపు బతుకని అసహ్యించుకునేలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు ప్రశాంత విప్లవాన్ని సాధించారు.
– డా. కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు





