News

అమెరికాలో హిందూ ఆలయాల భద్రతపై ఆందోళన.. శ్వేతసౌధంలో హిందూ ప్రతినిధుల భేటీ!

19views

అమెరికాలో హిందువులు, హిందూ దేవాలయాలపై పెరుగుతున్న దాడులు, విద్వేష ఘటనలపై హిందూ సమాజ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాలకు భద్రత పెంచాలని, హిందువుల మత స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.

అమెరికాలోని హిందూ సామాజిక కేంద్రం, ఆలయమైన కేశవంను శ్వేతసౌధం అధికారుల బృందం సందర్శించింది. శ్వేతసౌధం ఫెయిత్ డైరెక్టర్ జెన్నిఫర్ కార్న్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హిందూ సమాజ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంది.

ఈ సమావేశంలో హిందూ స్వయం సేవక్ సంఘ్ (HSS USA), సేవా ఇంటర్నేషనల్, బీఏపీఎస్ (BAPS), హిందూ యువ, ఇస్కాన్ (ISKCON), చిన్మయా మిషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్ తదితర ప్రముఖ హిందూ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమెరికాలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు, హిందూ సమాజంపై విద్వేషపూరిత ప్రచారం, మతపరమైన వివక్ష వంటి అంశాలను ప్రతినిధులు శ్వేతసౌధం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆలయాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని, హిందూ సమాజానికి తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

హిందూ సమాజ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
అమెరికాలో నివసిస్తున్న హిందువులు తమ మత సంప్రదాయాలను, ఆచారాలను స్వేచ్ఛగా పాటించే వాతావరణం ఉండాలని హిందూ సంస్థల ప్రతినిధులు ఆకాంక్షించారు. దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాకుండా, హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, సేవా కార్యక్రమాలకు కేంద్రాలుగా ఉన్నాయని వివరించారు.

హిందూ ఆలయాలపై దాడులు, మతపరమైన విద్వేష ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.