News

తుఫాన్లను తట్టుకుని నిలిచిన ప్రకృతి వ్యవసాయ వరి పంట

5views

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసిన వరి పంట తుఫాన్లు, భారీ వర్షాలను తట్టుకుని నిలబడిందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించి, ఈ సాగు విధానాన్ని అవలంబించాలని ఆమె సూచించారు.

దెందులూరు మండలం పోతునూరులో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసిన వరి పొలాలను శనివారం కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పంట పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లాలో ఇటీవల సంభవించిన తుఫాన్లు, భారీ వర్షాల ప్రభావాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసిన వరి మొక్కలు తట్టుకుని నిలబడటం గమనించదగ్గ విషయమన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.

అనంతరం రైతుల పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ వారి సాగు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.