News

ఛఠ్ పూజకు ముందు యమునా నదిలో చనిపోయిన చేపలు..

5views

దేశ రాజధాని ఢిల్లీలో ఛఠ్ పూజ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న వేళ యమునా నదిలో చనిపోయిన చేపలు కలకలం రేపుతున్నాయి. సోనియా విహార్ సమీపంలోని యమునా నదిలో గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయిన చేపలను పడేశారని ఆరోపిస్తూ ఢిల్లీ ప్రభుత్వ నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ -I&FCD పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, బాధ్యులను గుర్తించి వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది.

నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్ డివిజన్-IV) సోమనాథ్ కశ్యప్ సోనియా విహార్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశారు. ఛఠ్ పూజ సందర్భంగా యమునా నది తీరానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నదిలో చనిపోయిన చేపలను పడేసి ఉండవచ్చని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇలాంటి చర్యలు భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలిగిస్తాయని అధికారుల అభిప్రాయం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు ప్రతులను కరవాల్ నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌తో పాటు శాఖ ఉన్నతాధికారులకు కూడా పంపించారు.

యమునాలో చనిపోయిన చేపల వీడియోలు వైరల్
సోనియా విహార్ సమీపంలో యమునా నదిలో చనిపోయిన చేపలు నీటిపై తేలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చేపలు మృత్యువాత పడటానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటన యమునా నది నీటి నాణ్యతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.

ఆప్ నేతలపై మంజిందర్ సింగ్ సిర్సా సంచలన ఆరోపణలు
మరోవైపు, ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఈ ఘటనపై స్పందిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఛఠ్ పూజకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ నేతలే యమునా నదిలో చనిపోయిన చేపలను పడేశారని ఆయన ఆరోపించారు. నదిలో చనిపోయిన చేపలను పడేయడం కంటే పెద్ద పాపం మరొకటి ఉండదని మండిపడ్డారు. ఛఠ్ పూజ సందర్భంగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో యమునా నదిలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారని, అలాంటి పవిత్రమైన సందర్భానికి ముందు నదిలో చనిపోయిన చేపలను పడేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.

రేఖా గుప్తా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళనలో కీలక పురోగతి సాధించిందని, సుమారు 60 శాతం మేర శుభ్రపరిచే లక్ష్యాన్ని చేరుకున్నామని సిర్సా పేర్కొన్నారు. నదిలో క్రూయిజ్ సేవలు ప్రారంభం కావడం తమ ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. గత పదేళ్ల ఆప్ పాలనలో జరిగిన వైఫల్యాలు బయటపడుతుండటంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

యమునా నదిలో తెల్ల చేపలు లేనప్పుడు చనిపోయిన తెల్ల చేపలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

ఈ ఏడాది నవంబర్ 15, 16 తేదీల్లో యమునా నది తీరంలో ఛఠ్ పూజ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు సూర్య భగవానుడిని, ఛఠీ మాతను ఆరాధిస్తూ ఉపవాస దీక్షలు చేపట్టి, నదీ జలాల్లో నిలబడి ఉదయించే, అస్తమించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారు.

ఇలాంటి పవిత్రమైన పండుగకు ముందు యమునా నదిలో చేపలు చనిపోయి తేలడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. చేపలు మృత్యువాత పడటానికి కారణం ఏమిటి? ఈ ఘటన వెనుక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.