
కర్ణాటకలోని మంగళూరులో మైనర్ బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాథలిక్ చర్చి ఫాదర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాలెన్సియాలోని సెయింట్ విన్సెంట్ ఫెర్రర్ చర్చికి చెందిన ఫాదర్ సిప్రియన్ పింటోపై 14 ఏళ్ల వయస్సున్న ఐదుగురు బాలురను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
మంగళూరు పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడిని అతని బంధువుకు చెందిన ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియలు పూర్తిచేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు.
అక్టోబర్ 15వ తేదీ రాత్రి మంగళూరు సౌత్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం.. బాధితుల్లో ఒకరైన 14 ఏళ్ల బాలుడికి ఫాదర్ చాక్లెట్ ఇచ్చి, అతని నవ్వు బాగుందని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం చర్చిలోని ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా తాకినట్లు బాలుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తదుపరి సందర్భాల్లోనూ ప్రార్థనల కోసం చర్చికి వెళ్లినప్పుడు నిందితుడు తనను వేధించినట్లు బాధితుడు ఆరోపించాడు. ఆగస్టు 14వ తేదీ సాయంత్రం రిసెప్షనిస్ట్ గదిలోకి పిలిచి కౌగిలించుకుని, లోదుస్తుల లోపలికి చేయి పెట్టినట్లు ఫిర్యాదులో వివరించాడు.
మరో నలుగురు బాలురపైనా వేధింపుల ఆరోపణలు
తనకు ఎదురైన అనుభవాలను బాధితుడు తన నలుగురు స్నేహితులతో పంచుకున్నాడు. వారంతా కూడా తమకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని వెల్లడించినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఐదుగురు బాలుర వయస్సు 14 ఏళ్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బాధితుడు తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు మంగళూరు బిషప్‌ను సంప్రదించారు. అనంతరం బిషప్ సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
POCSO చట్టం కింద కేసు నమోదు
ఈ ఘటనపై పోలీసులు పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 9తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.




