నవమాసాలు మోసి, కంటికి రెప్పలా పెంచి, తమ జీవితాలను పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేసే తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం నేటి సమాజంలో ఆందోళన కలిగిస్తున్న అంశం. అలాంటి పరిస్థితుల్లో యువతలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో బిహార్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు అభిరామ్ కుమార్ దేశవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. కన్నవారిని వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలని, వారికి అండగా నిలవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏకంగా 35 వేల కిలోమీటర్లు చెప్పులు లేకుండానే నడుస్తున్నాడు.
నలందా జిల్లా బిహార్ షరీఫ్ ప్రాంతానికి చెందిన అభిరామ్ కుమార్.. దివంగత మనోహర్ లాల్, రాణి దేవి దంపతుల కుమారుడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఆయన తన స్వరాష్ట్రం నుంచే ఈ సుదీర్ఘ యాత్రను ప్రారంభించాడు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాలుగు ధామాలు, 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడంతో పాటు కైలాస మానస సరోవరం చేరుకోవాలన్నది ఆయన సంకల్పం. ఈ యాత్రకు సుమారు మూడేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నాడు.
105 రోజులుగా నిరంతర పాదయాత్ర
చెప్పులు లేకుండానే 105 రోజులుగా నిరంతరాయంగా నడుస్తున్న అభిరామ్ మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నాడు. త్వరలోనే పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకోనున్నాడు. ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరినీ కలుస్తూ తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండాల్సిన బాధ్యతలను వివరిస్తున్నాడు.
పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు తమ జీవితమంతా కష్టపడతారని, అలాంటి వారిని వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయడం తగదని చెబుతున్నాడు. తల్లిదండ్రులకు సమయం కేటాయించడం, ప్రేమాభిమానాలు చూపించడం, గౌరవంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని యువతకు సందేశమిస్తున్నాడు.
ఉచిత వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్న ఆశయం
తన పాదయాత్ర కేవలం పుణ్యక్షేత్రాల సందర్శనకే పరిమితం కాదని అభిరామ్ చెబుతున్నాడు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురై, ఆదరించే వారు లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు అండగా నిలవాలన్నది తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. యాత్ర పూర్తయిన అనంతరం తన స్వగ్రామంలోనే నిరాదరణకు గురైన వృద్ధుల కోసం ఉచిత వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆత్మీయత, ఆశ్రయం, అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నది తన జీవిత ఆశయమని చెబుతున్నాడు.
అభిరామ్ సంకల్పానికి ప్రజల సహకారం
సుదీర్ఘ దూరాన్ని పాదరక్షలు లేకుండా ప్రయాణిస్తున్న అభిరామ్‌ను చూసి మార్గమధ్యంలో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన యాత్ర లక్ష్యాన్ని తెలుసుకుని భోజనం, వసతి కల్పిస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు. భగవంతుడిపై భక్తితో పాటు సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్న ఆయన సంకల్పాన్ని పలువురు అభినందిస్తున్నారు.
తల్లిపై ప్రేమతో మరో యువకుడి సాహసయాత్ర!
ఇదిలా ఉండగా, తల్లి ఆరోగ్యం కుదుటపడాలని చిన్నతనంలో చేసుకున్న మొక్కును నెరవేర్చేందుకు బిహార్‌కు చెందిన మరో యువకుడు మోనూ చేపట్టిన యాత్ర కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. తన 13వ ఏట తల్లి అనారోగ్యం నుంచి కోలుకుంటే 12 జ్యోతిర్లింగాలు, చార్ధామ్ క్షేత్రాలను పరిగెత్తుకుంటూ దర్శించుకుంటానని సంకల్పించాడు.ఆ మొక్కును నెరవేర్చేందుకు 19 ఏళ్ల వయసులో 2026 మార్చి 15న తన తీర్థయాత్రను ప్రారంభించాడు. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో పర్యటించడంతో పాటు రెండు చార్ధామ్ క్షేత్రాలను దర్శించుకున్నట్లు సమాచారం. తల్లిపై ప్రేమతో ప్రారంభించిన ఈ సాహసయాత్ర కారణంగా సోషల్ మీడియాలో ‘బ్లాక్ పాంథర్’గా గుర్తింపు పొందుతున్నాడు.
కన్నవారిని గౌరవించడమే నిజమైన సంస్కారం!
ఒకరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దంటూ వేల కిలోమీటర్లు నడుస్తుంటే.. మరొకరు తల్లి ఆరోగ్యం కోసం చేసుకున్న మొక్కును నెరవేర్చేందుకు సాహసయాత్ర చేస్తున్నారు. ఈ ఇద్దరు యువకుల ప్రయాణాలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ, బాధ్యత, కృతజ్ఞతాభావం ఎంత గొప్పవో గుర్తుచేస్తున్నాయి.
హిందూ ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులను దైవసమానులుగా గౌరవించాలని బోధించారు. వారి వృద్ధాప్యంలో అండగా నిలవడం, సేవ చేయడం ప్రతి సంతానం ధర్మంగా భావించాలి. నిజమైన దైవభక్తి ఆలయాల సందర్శనతోనే ముగిసిపోదు.. మనకు జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడంలోనూ ప్రతిఫలించాలి.




