News

విష్ణు సహస్రనామపారాయణం.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

2views

ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో దైవ కార్యాలకు కొంత సమయాన్ని కేటాయించాలని త్రిదండి చిన జీయర్ స్వామి పిలుపునిచ్చారు. భగవంతుడి ఆరాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న చిన జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తీర్థగోష్ఠి, శ్రీ నరసింహ స్వామి ప్రార్థన, హారతి కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా జానపద కళాకారులు, సంకీర్తన మండలి బృందాలు నిర్వహించిన భక్తి గీతాలు, ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జీవ పరిశోధన విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాలను చిన జీయర్ స్వామి ఆవిష్కరించారు.

మహోత్సవాల్లో మరో విశేష ఘట్టంగా భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ప్రపంచ రికార్డు లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి పరిశీలించారు. అనంతరం చిన జీయర్ స్వామికి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

అలాగే సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఏఎస్ నారాయణతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమాల్లో అహోబిల జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శ్రీరామనగరం పులకించిపోయింది.