ArticlesNews

చిన్నపనితో పెద్ద పరివర్తన

0views

తింటే పెంట – పెడితే పంట, అనేది పశువుల (ముఖ్యంగా ఆవులు, గేదెలు) ప్రాధాన్యతను, వ్యవసాయంలో వాటి పాత్రను తెలియజేస్తుంది. దీని అంతరార్థం చాలా స్పష్టమైనది.. రైతుకు పశువులు కేవలం మేత తినే జంతువులు మాత్రమే కావు, అవి ఇచ్చే పేడ సహజసిద్ధమైన ఎరువుగా మారి పంటలు పండడానికి, తద్వారా దేశానికి ఆహారం లభించడానికి కారణమవు తుందని ఈ సామెత చెప్తుంది. పశుపోషణ, వ్యవసాయం ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ.

‘‘తింటే పెంట, పెడితే పంట’’ అనే ఈ సామెతలో జీవన సత్యం దాగి ఉంది. మనం తినే ఆహారం చివరికి వ్యర్థంగా మారుతుంది. కానీ అదే వ్యర్థాన్ని సరైన పద్ధతిలో వినియోగిస్తే అది పంటగా మారి మళ్లీ మన జీవితానికి ఉపయోగపడుతుంది. ఈ ఒక్క మాటలో ప్రకృతి చక్రం, వ్యవసాయ విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణ అన్నీ ఇమిడిపోయాయి. ఈరోజుల్లో మనం అభివృద్ధి పేరుతో ఎన్నో మార్పులు స్వీకరిస్తున్నాం. కానీ వాటితో పాటు చెత్త ఉత్పత్తి కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా వంటింటి వ్యర్థాలు, ఆహార అవశేషాలు, పండ్ల తొక్కలు, కూరగాయల మిగులు భాగాలు పెద్ద మొత్తంలో చెత్తకుప్పల్లో చేరుతున్నాయి. ఒకప్పుడు గ్రామీణ జీవన విధానంలో ఇవన్నీ సహజంగానే ఎరువులుగా మారేవి. ఇప్పుడు అవి పర్యావరణ సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రతి ఇంట్లో రోజూ కొంత ఆహార తప్పనిసరిగా వ్యర్థం అవుతుంది. మిగిలిన అన్నం, కూరగాయల తొక్కలు, పండ్ల మిగులు భాగాలు, టీ పొడి వంటి వాటిని సాధారణంగా చెత్తలో పడేస్తుంటాం. కానీ ఇవే పదార్థాలు కంపోస్ట్ ‌తయారీకి ఉపయోగపడతాయి. అవి నేలలో కలిసిన తర్వాత సేంద్రియ ఎరువులుగా మారి మొక్కలకు పోషకాలను అందిస్తాయి. ఇప్పటి జీవన విధానంలో, ఫాట్స్‌లో మనం శ్రద్ధ పెట్టి ఆహార వ్యర్థాలను నేరుగా చెత్తకుప్పలో వేస్తున్నాము. దీనివలన తగిన రీతిలో వీటిని ఉపయోగించే అవకాశం లేదు.

మన పూర్వికుల జీవన విధానం ప్రకృతికి దగ్గరగా ఉండేది. ఇంటి దగ్గరే పశువులు ఉండేవి. పశువుల పేడ, ఇంటి ఆహార అవశేషాలు, ఎండిన ఆకులు కలిసి సహజ ఎరువుగా మారేవి. రైతులు రసాయన ఎరువులపై ఎక్కువగా ఆధారపడేవారు కాదు. నేల సారవంతంగా ఉండేది. పంటలలో రుచి, పోషక విలువలు కూడా ఎక్కువగా ఉండేవి. చిన్న స్థాయిలో అయినా ప్రతి కుటుంబం తడి చెత్తను వేరు చేసి కంపోస్ట్‌గా మార్చడం ప్రారంభిస్తే పెద్ద మార్పు సాధ్యమవుతుంది. ఒక చిన్న బకెట్‌, ‌కొంత మట్టి, ఎండిన ఆకులు ఉంటే ఇంట్లోనే ఎరువు తయారు చేయవచ్చు. ఈ ఎరువుతో కూరగాయల మొక్కలు, పూల మొక్కలు పెంచవచ్చు. ఇది కేవలం వ్యవసాయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఆహారాన్ని వృథా చేయకుండా ఉండటం కూడా దీనిలో భాగమే. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఆకలితో బాధపడుతుంటే, మరోవైపు ఎంతో ఆహారం చెత్తలో పడిపోతుంది. మన ఇంటి వంటగది నుంచి ప్రారంభమయ్యే చిన్నమార్పు, సమాజంలో పెద్ద పరివర్తనకు దారితీస్తుంది. అందుకే ఆహారాన్ని గౌరవిద్దాం, వ్యర్థాన్ని తగ్గిద్దాం, ప్రకృతిని పరిరక్షిద్దాం.

– డా. జేపీ భారతి కాజా