
మైసూరులోని చాముండి కొండల పాదాల వద్ద ఉన్న జయచామరాజ వడియార్ ఉన్నత విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారతదేశపు తొలి ఎస్ఈడీ ప్లానిటోరియం, ప్రపంచంలోనే తొలి టిల్టెడ్ ఎస్ఈడీ డోమ్ ప్లానిటోరియం అయిన ‘కాస్మోస్-మైసూరు’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారతదేశంలో విజ్ఞానం, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఎప్పుడూ కలిసే అభివృద్ధి చెందాయని అన్నారు. ఆధ్యాత్మికత మనిషిని అంతర్ముఖంగా ఆలోచింపజేస్తే, విశ్వ అధ్యయనం ఆకాశం వైపు చూసేలా ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. మన పూర్వీకులు ఆకాశాన్ని పరిశీలించి, నక్షత్రాలు, గ్రహాల కదలికలను అర్థం చేసుకుని పంచాంగాలను రూపొందించారని గుర్తుచేశారు. సూర్య, చంద్ర గ్రహణాల సమయాలను కూడా వారు కచ్చితంగా లెక్కించారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందే ఆర్యభట్ట, వరాహమిహిరుడు వంటి గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలు అనేక ఆవిష్కరణలు చేశారని, సంక్లిష్టమైన గణనలను నిర్వహించారని చెప్పారు.
ప్రస్తుత కాలంలో భారత అంతరిక్ష కార్యక్రమం సామాజిక ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ప్రధానమంత్రి వివరించారు. మత్స్యకారుల భద్రత కోసం ఇస్రో ప్రత్యేక ఉపగ్రహ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసిందని, ఇది వారి ప్రయాణాలను సురక్షితం చేయడంతో పాటు, విపత్తుల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి కూడా ఉపయోగపడుతోందని తెలిపారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు సంస్థలకు తెరవడం ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం యువ పారిశ్రామికవేత్తలు సొంతంగా రాకెట్లను ప్రయోగిస్తూ, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారని, దేశంలో గతంలో ఎన్నడూ చేపట్టని ప్రయోగాలు నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.




