
నేల ఆరోగ్యాన్ని పరిరక్షించి, భావితరాలకు సారవంతమైన భూమిని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ వి. జయలక్ష్మి పిలుపునిచ్చారు. భూసారాన్ని కాపాడుకోవడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు భవిష్యత్ ఆహార భద్రతకు భరోసా కల్పించవచ్చని పేర్కొన్నారు.
నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ పొలం సంరక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్యంగా ప్రసంగించారు. భూసార పరీక్షల ఆధారంగా పంటలకు అవసరమైన ఎరువులను సమతుల్యంగా వినియోగించాలని రైతులకు సూచించారు. నేలలో సేంద్రియ పదార్థాల శాతాన్ని పెంచడంతో పాటు పంట మార్పిడి విధానాలను అనుసరించాలని వివరించారు. రైతులు తమకు అందించిన భూసార ఆరోగ్య పత్రాల్లోని సూచనలను తప్పనిసరిగా పాటించాలని, తద్వారా నేలలోని పోషక విలువలను కాపాడుకోవచ్చని తెలిపారు.
మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్యామ్ రాజ్ నాయక్ మాట్లాడుతూ.. పంటల దిగుబడి పెంచాలనే ఉద్దేశంతో అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకూడదని సూచించారు. రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని చెప్పారు. నేల పరిరక్షణ అనేది కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాదని, దేశ ఆహార భద్రతతో ముడిపడి ఉన్న కీలక అంశమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘ఖేత్ బచావో అభియాన్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతులకు భూసార ఆరోగ్య పత్రాలను పంపిణీ చేసి, వాటి ఆధారంగా ఎరువుల వినియోగం, నేల సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి బాటలు వేయవచ్చని కార్యక్రమంలో వక్తలు అభిప్రాయపడ్డారు.





