
దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. అలాంటి స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకుల సేవలను కేవలం జ్ఞాపకాలకే పరిమితం చేయకుండా.. నిత్యం ప్రజల కళ్లముందు నిలిపే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని వస్త్రపురి కాలనీ యువత, స్థానికులు.
దేశభక్తి అనేది మాటల్లోనే కాదు.. మన నిత్యజీవితంలోనూ ప్రతిబింబించాలనే సంకల్పంతో కాలనీలోని వీధులకు జాతీయ నాయకుల పేర్లు పెట్టారు. ప్రతి వీధికి ఒక మహనీయుడి పేరు పెట్టి, వారి పేర్లతో ప్రత్యేక నామఫలకాలను ఏర్పాటు చేశారు.
ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, స్వామి వివేకానంద వంటి మహనీయుల పేర్లను వీధులకు నామకరణం చేశారు. దీంతో కాలనీలోని ప్రతి వీధి ఒక చరిత్రను గుర్తుచేస్తుండగా, అక్కడ ఏర్పాటు చేసిన నామఫలకాలు జాతీయ నాయకుల త్యాగనిరతిని భావితరాలకు పరిచయం చేస్తున్నాయి.
స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరుల నుంచి దేశ నిర్మాణానికి జీవితాలను అంకితం చేసిన మహనీయుల వరకు.. వారి సేవలను స్మరించుకునేలా ఈ కార్యక్రమం సాగింది. ముఖ్యంగా నేటి యువతలో దేశభక్తి, జాతీయ భావన, చరిత్ర పట్ల గౌరవం పెంపొందించాలనే సందేశాన్ని ఈ ప్రయత్నం చాటుతోంది.
వీధి పేరు పలికిన ప్రతిసారీ ఆ మహనీయుడి త్యాగం, పోరాటం, దేశానికి చేసిన సేవ గుర్తుకొచ్చేలా చేసిన వస్త్రపురి కాలనీ వాసుల ఆలోచన స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశం కోసం పాటుపడిన మహనీయులను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెబుతోంది.





