News

‘దేవదాయ భూముల లీజు’ పాలసీని ప్రభుత్వం పునఃపరిశీలిస్తుంది : హైకోర్టుకు నివేదించిన ఏజీ..

2views

దేవదాయశాఖ ఆస్తులను లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న పాలసీని ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. పురోగతికి సంబంధించి వివరాలు కోర్టుకు సమర్పించేందుకు పాలసీని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను రెండు వారాలకు వాయిదా వేయా లని కోరారు. అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ తో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. వాదనలు వినిపించాలని భావిస్తే తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దేవదాయ శాఖ ఆస్తులను లీజు ప్రాతి పదికన కేటాయించేందుకు వీలుగా ఏపీ చారిటబుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టి ట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రూల్స్ 2003 నిబంధనలు సవరిస్తూ దేవదాయ శాఖ 2026 జనవరి 9న జారీచేసిన జీవో 15ను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన వి.దుర్గా ప్రసాద్, అల్లవరపు దుర్గాభరత్, జీవోను రద్దు చేయాలని కోరుతూ తాడేపల్లిగూడేనికి చెందిన గొల్లపూడి ముఖర్జీ పిటిషన్లు వేశారు. అలాగే సవరించిన నిబంధనలకు అనుగుణంగా కాకినాడ రూరల్ జిల్లా సర్పవరం గ్రామంలోని భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన భూమిని క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం కేటాయిస్తూ 2026 జనవరి 27న జారీ చేసిన జీవో 55ను సవాల్ చేస్తూ బర్ల శ్రీను మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేసేవరకు సవరించిన నిబంధనల ప్రకారం దేవదాయ ఆస్తులు లీజుకు ఇవ్వబోమని ఏజీ హామీ ఇచ్చారని, దానికి విరుద్ధంగా దేవస్థానం భూములను స్టేడియానికి కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవో 15, జీవో 55 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తే వాటి తొలగింపునకు ఆదేశిస్తాం: హైకోర్టు
అదేవిధంగా చిత్తూరు జిల్లా దసరపల్లి గ్రామం లోని ధర్మరాజుల స్వామి దేవస్థానానికి చెందిన భూమిని న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని కూడా అదే రోజుకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. భూ కేటాయింపు, అక్కడ చేపట్టే పనులు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరిపితే వాటి తొలగింపునకు ఆదేశాలిస్తామని, ఆ అధికారం తమకు ఉందని తెలిపింది. దాసరపల్లిలో ఉన్న ధర్మరాజుల స్వామి వారి దేవ స్థానికి చెందిన 10.60 ఎకరాల వ్యవసాయ భూములను లీజు ప్రాతిపదిన న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కె.గజేంద్ర పిల్ వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. భూకేటాయింపు, ఆ భూముల్లో చేపట్టే పనులు ప్రస్తుత పిల్ లో కోర్టు ఇచ్చే తుదితీర్పుకి లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు.