
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జిషీట్ దాఖలు చేసిందని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఇక దీని విచారణ స్థానిక కోర్టులోనే కొనసాగుతుందని పేర్కొంటూ, సదరు పిటిషన్లపై విచారణను ముగించింది.
యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ఆలయంలోని విరాళాలను దుర్వినియోగం చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని తెలిపారు. కొంత మంది నిందితులు ఆ నిధులతో పెట్టుబడులు పెట్టగా, మరికొందరు ఆ సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్లుగా ఉంచారని పేర్కొన్నారు. కాగా ఆలయ విరాళాల దుర్వినియోగానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసి, అయోధ్య జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. దీనిని నోట్ చేసుకున్న సుప్రీంకోర్టు, ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లను డిస్పోజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై ఈ వివాదంపై విచారణ స్థానిక కోర్టులోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసు మెరిట్స్‌పై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తపరచమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై స్వతంత్ర విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో కొందరు రిట్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందుకే రామమందిర నిధుల దుర్వినియోగం కేసు విచారణలో అయోధ్య స్థానిక కోర్టుకు సాయపడేందుకు ధర్మాసనం వారి వాదనలు నమోదు, సదరు పిటిషన్లను కొట్టివేసింది. కాగా, అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై కోర్టు నియమించిన సిట్ సెప్టెంబర్ 25న లేదా అంతకంటే ముందుగా తమ మొదటి ఛార్జిషీటు దాఖలు చేస్తామని సెప్టెంబర్ 21న కోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే.





