News

యూపీలో మతమార్పిడి ఆరోపణలు.. లక్నోలో 100 మంది, కాన్పూర్‌లో 400 మంది లక్ష్యంగా ప్రయత్నాలు ?

7views

లక్నో/కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి ఆరోపణలు మరోసారి కలకలం రేపాయి. లక్నోలో సుమారు 100 మంది హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని, కాన్పూర్‌లో చర్చి వార్షికోత్సవం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 400 మంది హిందువులను మతమార్పిడికి ప్రోత్సహించేందుకు యత్నించారని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ రెండు ఘటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

లక్నోలోని రాజాజీపురం ప్రాంతంలో రత్నం కంటి ఆసుపత్రి సమీపంలోని ఓ ఇంట్లో క్రైస్తవ ప్రార్థనా సమావేశం జరుగుతోందన్న సమాచారంతో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఆ ఇంట్లో సుమారు 100 మంది హిందువులను సామూహికంగా క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. సమావేశంలో పాల్గొన్నవారిని క్రైస్తవ మతాన్ని స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నారని, ‘దేవుడు ఏమీ కాదు.. యేసు క్రీస్తే సర్వస్వం’ అనే సందేశంతో ప్రచారం చేస్తున్నారని బజరంగ్ దళ్ కార్యకర్తలు పేర్కొన్నారు.

తమలో కొందరు గుర్తింపును వెల్లడించకుండా సమావేశంలోకి ప్రవేశించారని, క్రైస్తవ మతాన్ని స్వీకరించేందుకు వచ్చామని చెప్పిన తర్వాతే అనుమతి లభించిందని కార్యకర్తలు వెల్లడించారు.

అయితే, అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను ప్రశ్నించిన సమయంలో తమపై దాడి చేసి, నెట్టివేశారని హిందూత్వ సంఘాల కార్యకర్తలు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, పరిపాలనా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కాన్పూర్‌లో 400 మంది హిందువుల మతమార్పిడికి ప్రయత్నం
మరోవైపు కాన్పూర్‌లోనూ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 30 సాయంత్రం ఖలాసీ లైన్ ప్రాంతంలోని ‘ది గ్రేస్ అండ్ గ్లోరీ చర్చి’ మూడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో మతమార్పిడికి ప్రోత్సహించే ప్రయత్నాలు జరిగాయని బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు.

80 ఫీట్ల రోడ్డులో ఉన్న చర్చి వార్షికోత్సవం కోసం హరిహరనాథ్ శాస్త్రి కళా, సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన సుమారు 400 మంది హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని బజరంగ్ దళ్ మాజీ కాన్పూర్ కన్వీనర్ కృష్ణ తివారీ ఆరోపించారు.

కార్యక్రమంలో పాల్గొన్న కొందరు హిందూ మహిళలు తమను విగ్రహారాధనకు దూరంగా ఉండాలని, దానికి బదులుగా మానవత్వాన్ని ఆరాధించాలని ప్రోత్సహించినట్లు వెల్లడించారని ఆయన పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్ ఎదుట బజరంగ్ దళ్ ధర్నా
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిర్వాహకులతో సహా పలువురు వెనుక ద్వారం గుండా వెళ్లిపోయారని బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.