News

జ్ఞానాన్ని సేకరించి పంచుకోవడమే సాంప్రదాయ బౌద్ధిక సంస్కృతి ప్రధాన ఉద్దేశం : ప్రశాంత్ పోల్

34views
హిమాచల్ ప్రదేశ్‌లోని ఘుమార్వీన్ జగన్ ప్యాలెస్‌లో అక్టోబర్ 25న ప్రజ్ఞా ప్రవాహ్ మొదటి ప్రణాళిక, సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్, ప్రముఖ రచయిత ప్రశాంత్ పోల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశం అర్థవంతమైన సంభాషణల సాంప్రదాయం ద్వారానే నిర్మితమైందని, నిరంతర, ఆరోగ్యకరమైన, బహుళ కోణాల చర్చల ద్వారానే దేశ భవిష్యత్తును మరింత బలోపేతం చేయవచ్చని ఆయన తెలిపారు.

భారతీయ సంభాషణ తత్వశాస్త్రం

వాదించి గెలవడం కాకుండా తెలుసుకోవడం, ఇతరులకు తెలియజేయడమే భారతీయ సంభాషణ మూలసూత్రమని ప్రశాంత్ పోల్ వివరించారు. ఎవరి ఆధిక్యతను నిరూపించుకోవడానికి కాకుండా, జ్ఞానాన్ని సేకరించి పంచుకోవడమే మన సాంప్రదాయ బౌద్ధిక సంస్కృతి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రస్తుత టీవీ ఛానెళ్లు, బహిరంగ వేదికలలో జరిగే వివాదాస్పద చర్చలు మన సాంప్రదాయ సంభాషణ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించవని స్పష్టం చేశారు.

భారతీయ ప్రాచీన సంభాషణ సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మొదటి లోక్‌మంథన్ “వలసవాదం నుండి భారతీయ మనస్సు విముక్తి” అనే అంశంపై జరిగింది. అర్థవంతమైన చర్చలు కేవలం నగరాలు, మేధావుల వర్గానికే పరిమితం కాకుండా గ్రామాలు, అటవీ ప్రాంతాలు, గిరిజన సమాజాలకు సైతం చేరాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. సామాజిక శ్రేణిలో చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా జాతీయ చర్చలలో సమాన భాగస్వామ్యం ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

లోక్‌మంథన్ 2026 పిలుపు:

2026 డిసెంబర్ 4 నుండి 6 వరకు జైపూర్‌లో జరగనున్న లోక్‌మంథన్ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మేధావులు, జానపద కళాకారులు, రచయితలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రశాంత్ పోల్ పిలుపునిచ్చారు. ఈసారి లోక్‌మంథన్ ఇతివృత్తం “భారతీయులమైన మేము” అని అన్నారు.

ఈ సమావేశంలో ప్రజ్ఞా ప్రవాహ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర కన్వీనర్ గా హేమాంశు మిశ్రా, రాష్ట్ర కో-కన్వీనర్ గా డాక్టర్ రాజేష్ శర్మ , రాష్ట్ర కోశాధికారి గా డాక్టర్ అశోక్ తివారీ, రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ గా అశోక్ టాండన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా డాక్టర్ జస్పాల్ ఖత్రీ, డాక్టర్ నీలం ఠాకూర్, భూదేవ్ శర్మ, డాక్టర్ అరుణ్ కుమార్ సింగ్, డాక్టర్ విజయ్, డాక్టర్ పి. ఎల్. వర్మ, అజయ్ బన్యాల్, తుషార్ పరాశర్, డాక్టర్ మోహిని అరోరా ఎన్నుకున్నారు.