
అయోధ్య రామమందిరాన్ని 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అదే స్థలంలో నిర్మించారా? లేదా? అనేది నిర్ధరించేందుకు ఒక కమిటీ లేదా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
2019 నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు కలిగిన రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ఒక ట్రస్ట్ ద్వారా రామమందిర నిర్మాణం చేపట్టేందుకు మార్గాన్ని సుగమం చేసింది. అంతేకాదు, సున్నీ వక్ఫ్‌బోర్డుకు మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం, కూల్చివేసిన బాబ్రీ మసీదు ఉన్న 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ట్రస్టుకు మూడు నెలల్లోపు ఆ భూమిని అప్పగించాలి.
పిటిషన్లో ఏముంది?
సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ‘శ్రీరామ జన్మభూమి కేసు ట్రస్ట్’ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్ నవంబర్ 2న విచారణకు రానుంది. దీనిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది.
ప్రస్తుతం దాఖలైన పిటిషన్లో, సుప్రీంకోర్టు గతంలో ఏ భూమిపై రామమందిరం కట్టాలని నిర్దేశించిందో, అందులోనే రామమందిర నిర్మాణం జరిగిందా? లేదా? అని నిర్ధరించాలని కోరారు. అలాగే సదరు భూమికి సంబంధించి స్వతంత్ర సర్వే లేదా సరిహద్దు గుర్తింపు చేపట్టాలని కోరారు. ఇందులో భాగంగా, ఆ భూమి కచ్చితమైన సరిహద్దులు, కోఆర్డినేట్లు, విస్తీర్ణం, స్థానాన్ని గుర్తించాలని అభ్యర్థించారు.
“ప్రస్తుతం నిర్మించిన లేదా అభివృద్ధి చేసిన ఆలయం, ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అదే స్థలంలో ఉందా, లేదా అనేది నిర్ధరించాలి. ఇందుకోసం సర్వోన్నత ధర్మాసనం ఒక స్వతంత్ర కమిటీ లేదా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఇందులో సర్వే, రెవెన్యూ, పురావస్తు, ఇతర రంగాలకు చెందిన నిపుణులు ఉండాలి. ఒకవేళ వారి పరిశీలనతో, గతంలో సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న ప్రాంగణానికి, ఆలయం నిర్మించిన ప్రాంగణానికి మధ్య ఏమైనా గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తే, 2019 నాటి తీర్పును యథాతథంగా అమలు చేసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలి” అని ఈ పిటిషన్లో కోరారు.
“ఆలయ ప్రాంగణాన్ని గుర్తించడం, సరిహద్దులను నిర్ణయించడం, అభివృద్ధి చేయడానికి సంబంధించిన అన్ని అసలు పత్రాలు, మ్యాప్‌లు, ప్రణాళికలు, సర్వేలు, రికార్డులను భద్రపరచాలి. అలాగే వాటిని న్యాయస్థానం ముందు ఉంచాలని సంబంధిత అధికారులను, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఆదేశించాలి” అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
కాగ్ చేత ఆడిట్ చేయించాలి!
“ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం అవసరమైన సౌకర్యాలను కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలి. అలాగే విరాళాలు, కానుకలు, రసీదుల వివరాలను ప్రతిరోజూ డిజిటలైజ్ చేసి, వాటిని నిరంతరం ప్రదర్శించాలి. అలాగే నిధులు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా’ (కాగ్) చేత ఏటా ఆడిట్ నిర్వహించాలి” అని సదరు పిటిషన్లో అభ్యర్థించారు.
ఇంతకీ ఏమిటీ వివాదం?
అయోధ్యలోని వివాదాస్పద స్థంలో 16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ సమీదు ఉండేది. 1992 డిసెంబర్ 6న హిందూ కరసేవకులు దీనిని కూల్చేశారు. దీనితో అక్కడ మతపరమైన అల్లర్లు చెలరేగాయి, కేసులు నమోదు అయ్యాయి. 2010లో అలహాబాద్ హైకోర్టు, అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహి అఖారా, రామ్ లల్లా అనే మూడు పక్షాలకు సమానంగా పంచాలని తీర్పునిచ్చింది. దీనిపై వచ్చిన 14 అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి 2019లో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సదరు వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణం చేపట్టడానికి మార్గం సుగమం చేసింది.





