జాతిపిత 157వ జయంతి వేడుకల సందర్భంగా అమెరికాలోని నార్త్ డకోటా రాష్ట్రంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నార్త్ డాకోటా గవర్నర్ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్, ప్రథమ మహిళ కేర్స్టీ ఆర్మ్‌స్ట్రాంగ్, కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా సంయుక్తంగా గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ‘ప్రపంచంతో స్నేహంగా ఉండండి, యావత్ మానవ కుటుంబాన్ని ఒక్కటిగా చూడండి’ అనే గాంధీజీ స్ఫూర్తిదాయక సందేశంతో కూడిన ప్రత్యేక పలకను ఈ విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. అలాగే ఆ పలకపై ‘భారత ప్రజల నుంచి నార్త్ డకోటా ప్రజలకు’ అని రాశారు. బిస్మార్క్లోని పీస్ పార్క్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సియాటెల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ సహకారంతో నార్త్ డకోటాలోని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ అండ్ ట్రేడ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రథమ మహిళ కెర్స్టి ఆర్మ్‌స్ట్రాంగ్ భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో స్థానిక పాఠశాల విద్యార్థులు గాంధీజీకి ఇష్టమైన భజనలను ఆలపించారు.
ప్రపంచానికి గాంధీజీ సందేశం
నార్త్ డాకోటాలో ఒక భారతీయ నేత విగ్రహాన్ని ప్రతిష్టించడం ఇదే మొదటిసారి. మహాత్మా గాంధీ 157వ జయంతి మాసంలో అక్టోబర్ అంతర్జాతీయ అహింసా దినోత్సవ స్ఫూర్తితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు నేటి ప్రపంచ పరిస్థితుల్లో గాంధేయవాద ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సీటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా మాట్లాడారు.”ప్రస్తుతం ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణలు కలవరపెడుతున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో నార్త్ డాకోటా భూమి నుంచి గాంధీజీ అహింసా సందేశం అమెరికా సరిహద్దులు దాటి ప్రపంచమంతటికీ విస్తరించడం ముఖ్యమైన అంశం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలు పరస్పర స్నేహానికి ఇది నిదర్శనం” అని పేర్కొన్నారు.
భారత్-నార్త్ డకోటా స్నేహానికి గుర్తింపు
గాంధీజీ వేడుకను తమ రాష్ట్రంలో జరుపుకోవడం తమకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని కేర్స్టీ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్నారు. గాంధీజీ చూపిన శాంతి మార్గం గతంలో కంటే నేటి ఆధునిక కాలంలోనే ఎంతో అవసరమన్నారు. గాంధీజీ బోధనలు భారత సరిహద్దులకే పరిమితం కాదని కమిషనర్ డౌగ్ గోహ్రింగ్ అన్నారు. ప్రపంచ మానవాళితో పాటు తమ నార్త్ డాకోటా ప్రజల హృదయాల్లోనూ గాంధేయ ఆదర్శాలు బలంగా నాటుకుపోయాయన్నారు. భారత్-నార్త్ డాకోటా మధ్య పెరుగుతున్న సత్సంబంధాలకు ఈ విగ్రహం ఒక శాశ్వత చిహ్నంగా నిలుస్తుందన్నారు.
అమెరికా గడ్డపై ‘రఘుపతి రాఘవ రాజారామ్’, ‘వైష్ణవ జన తో’
విగ్రహావిష్కరణలో భాగంగా నార్త్ డాకోటాకు చెందిన అమెరికన్ పాఠశాల విద్యార్థులు గాంధీజీకి ఎంతో ఇష్టమైన భజనలను, ప్రార్థనా గీతాలను ఆలపించారు. ‘రఘుపతి రాఘవ రాజారామ్’, ‘వైష్ణవ జన తో’ వంటి గీతాలను స్థానిక చిన్నారులు గానం చేస్తుంటే హాజరైన సదస్సు అంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది. పాశ్చాత్య వేదికపై భారతీయత ప్రతిధ్వనించడంతో ప్రవాసులను ఆనందంలో మునిగిపపోయారు.
బిస్మార్క్ నగర కేంద్రంలో ఉన్న పీస్ పార్క్‌కు కూడా ప్రత్యేక చరిత్ర ఉంది. సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత కొద్దికాలానికే ఈ పార్కును అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఇందులో పలు కాంస్య శిల్పాలు ఉన్నాయి. నార్త్ డకోటాకు చెందిన ‘గాంధీ పీస్’ నెట్వర్క్ ఏర్పాటు చేసిన ‘పీస్ పోల్’ కూడా ఇక్కడ ఉంది. తాజాగా గాంధీజీ విగ్రహం ఏర్పాటుతో ఈ పార్కుకు మరింత ప్రత్యేకత సంతరించుకొంది. శాంతి, అహింసలకు సార్వత్రిక చిహ్నంగా నిలిచిన గాంధీజీ జీవితం, సందేశం ప్రజలకు నిరంతరం గుర్తుండేలా ఈ విగ్రహం నిలుస్తుందని భారత కాన్సులేట్ పేర్కొంది. 2023 నవంబర్‌లో సియాటెల్‌లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి భారత్, నార్త్ డకోటా మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయని కాన్సులేట్ తెలిపింది.



