
ఒడిశాలోని రాయగఢ్ జిల్లాలో ఓ మారుమూల గిరిజన గ్రామం. ఉదయం ఆరు గంటలు కాగానే చిన్నారులంతా పుస్తకాలు పట్టుకుని శాంతను మహాపాత్ర ఇంటికి చేరుకుంటారు. అక్కడ అక్షరాలు నేర్చుకుంటారు.. రాగి జావ తాగి పాఠశాలకు వెళ్తారు. సాయంత్రం మళ్లీ వచ్చి హోంవర్క్ చేసుకుంటారు. ఇలా దాదాపు 28 ఏళ్లుగా గిరిజన పిల్లల జీవితాల్లో విద్యాజ్యోతులు వెలిగిస్తున్నారు శాంతను మహాపాత్ర. గ్రామస్థులంతా ఆమెను ప్రేమగా ‘శాంతా ఆపా’ అని పిలుస్తారు.
ఆడపిల్లల చదువు కోసం ఎన్నో అవరోధాలు!
కటక్ జిల్లాలోని ఐన్పూర్ గ్రామంలో జన్మించిన శాంతను, సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. 1998లో కస్తూర్బా గ్రామ్సేవా బాల్వాడీ కేంద్రంలో చేరి, అక్కడి నుంచి గిరిజన గ్రామానికి వెళ్లారు. అప్పట్లో ఆ ప్రాంతంలో రోడ్లు, రవాణా సౌకర్యాలు అంతంతమాత్రమే. ఆడపిల్లలను చదివించడానికి కూడా చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపేవారు కాదు.
స్థానిక సర్పంచ్ సహకారంతో కొంతమంది బాలికలను తన దగ్గర ఉంచుకుని చదువు చెప్పడం ప్రారంభించారు. ఆడపిల్లలకు చదువెందుకంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. తన దగ్గర చదువుకున్న బాలికలు ఉన్నత విద్యను అభ్యసిస్తూ, ఉద్యోగాల్లో స్థిరపడటం చూసి గ్రామస్థుల్లోనూ మార్పు వచ్చిందని ఆమె చెబుతున్నారు.
పాఠాలతో పాటు జీవిత పాఠాలు!
శాంతను పిల్లలకు అక్షరాలు నేర్పడానికే పరిమితం కావడం లేదు. ప్రపంచ పరిణామాలను కథల రూపంలో వివరిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని వారికి బోధిస్తున్నారు.
ప్రస్తుతం 65 ఏళ్ల వయసులోనూ ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. భవనం శిథిలావస్థకు చేరినా, సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నా తన సేవలను కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఆమె వద్దకు వస్తున్నారు.
బాల్యవివాహాలు, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం
విద్యతో పాటు మహిళా అక్షరాస్యత, బాల్యవివాహాల నిర్మూలన, మద్యపాన నిషేధంపై శాంతను అవగాహన కల్పిస్తున్నారు. గిరిజన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించాలని, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు.
గిరిజన పిల్లల భవిష్యత్తే తన లక్ష్యంగా భావిస్తున్న శాంతను మహాపాత్ర సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకం. సమాజంలో మార్పు తీసుకురావడానికి పెద్ద పదవులు, అపారమైన సంపద అవసరం లేదని.. విద్య పట్ల నిబద్ధత, సేవాభావం ఉంటే ఎన్నో జీవితాలను మార్చవచ్చని ఆమె ప్రయాణం చాటిచెబుతోంది.




